Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని ప్రతిఘటించాలి
- రాజ్యాంగం, ప్రజాస్వామిక హక్కులు, సమాఖ్యస్ఫూర్తిపై బీజేపీ దాడి
- హిందీని గౌరవిస్తాం... అందరూ అదేభాష మాట్లాడాలనడం తగదు
- జీఎస్టీ పేరుతో ఆదాయ వనరులపై మోడీ సర్కారు పెత్తనం
- సుప్రీం తీర్పు చారిత్రాత్మకం
- జాతీయ సమైక్యతా భావనను కాపాడాలి : కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్
- కరోనా తర్వాత ప్రత్యక్షంగా సుందరయ్య 37వ స్మారకోపన్యాసం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలపై పోరాడాలని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ పిలుపునిచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని ప్రతిఘటించాలని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామిక హక్కులు, సమాఖ్యస్ఫూర్తిపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని విమర్శించారు. జీఎస్టీకి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమనీ, దీనిపై దేశంలో విస్తృతంగా చర్చ జరగాలని అన్నారు. దేశంలో విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, ఆహారపు అలవాట్లు, సంస్కృతి ప్రజల్లో ఉన్నాయని వివరించారు. అయినా భారతదేశం ఒక్కటేననీ, భారతీయులంతా సమానమేనని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన లౌకిక పునాదిని, ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తితోపాటు జాతీయ సమైక్యతా భావనను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే)లో పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి బాలగోపాల్, తమ్మినేని వీరభద్రం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం 'ఫెడరలిజం-రాజ్యాంగ సూత్రాలు-ముంచుకొచ్చిన ప్రమాదం'అనే అంశంపై స్మారకోపన్యాసం జరిగింది. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లు ఆన్లైన్లో స్మారకోపన్యాసం నిర్వహించారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా ఈ స్మారకోపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా బాలగోపాల్ మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో సుందరయ్య ఒకరని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి దేశాన్ని ఉత్తేజ పరిచారని గుర్తు చేశారు. ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం సాగిస్తున్నదని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ వల్ల రూ.పది వేల కోట్లు, గ్రాంట్లు ఇవ్వకపోవడం వల్ల రూ.ఏడు వేల కోట్లు కలిపి కేరళ రూ.17 వేల కోట్లు నష్టపోతున్నదని వివరించారు. ఇలా తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. ఇంకోవైపు జీఎస్టీ వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారం వచ్చేనెల వరకే వర్తిస్తుందని అన్నారు. ఆ తర్వాత నష్టమొచ్చినా కేంద్రం పట్టించుకోబోదని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ పరిహారాన్ని ఐదేండ్ల వరకు కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం గణాంకాల ప్రకారం కేంద్రానికి 62.7 శాతం ఆదాయం వస్తుంటే, 62.4 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని వివరించారు. రాష్ట్రాలు, కేంద్రం కలిస్తేనే భారతదేశం అవుతుందన్నారు. కానీ కేంద్రమొక్కటే భారత్ అయినట్టు, నిధులు, వనరులపై పెత్తనం సాగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. హిందీ అంటే అందరికీ గౌరవమే కానీ దేశంలోని ప్రజలంతా అదేభాష మాట్లాడాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించడం తగదని హెచ్చరించారు. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు వంటి ఆయా రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందన్నారు.
ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్‌తో నష్టం
ఒకేదేశం, ఒకే రిజిస్ట్రేషన్ వల్ల రాష్ట్రాల ఆదాయానికి తీవ్ర నష్టం కలుగుతున్నదని బాలగోపాల్ చెప్పారు. ఆదాయ వనరులన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తున్నాయని విమర్శించారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, మద్యంపైనే పన్ను వేసి ఆదాయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇంకోవైపు పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా, ఆర్థిక వనరుల పంపిణీ సరిగ్గా లేదని అన్నారు. పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటాలోనూ 19 శాతం నుంచి 7.8 శాతానికి కేంద్రం తగ్గించిందని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని వివరించారు. కార్పొరేట్ సంస్థల ఆదాయం పెరుగుతున్నదని చెప్పారు. కానీ కార్పొరేట్లపై విధించే పన్ను మాత్రం పెరగడం లేదని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నదని వివరించారు. యుద్ధాలు, విపత్తులు సంభవించినపుడు కేంద్రం సెస్, సర్‌చార్జీలు వేయాలని గుర్తు చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం అన్ని వస్తువులపైనా సెస్‌లు వసూలు చేస్తున్నదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై పన్ను రాష్ట్రాలు వేస్తాయని చెప్పారు. కానీ ఆ పన్ను కంటే కేంద్రం విధించే సెస్ ఎక్కువగా ఉంటోందని అన్నారు. అంటే అసలు కంటే కొసరు ఎక్కువగా ఉంటోందన్నారు. ఆర్థిక వనరుల పంపిణీలో కేరళ 3.875 శాతం నుంచి 1.925 శాతానికి, తమిళనాడు 6.637 శాతం నుంచి 4.079 శాతానికి, ఏపీ 8.465 శాతం నుంచి 4.047 శాతానికి, తెలంగాణ 2.4 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గిపోయాయని వివరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం కరోనా సమయంలో జీఎస్డీపీలో ఐదు శాతం అప్పు తెచ్చుకునేందుకు అవకాశముండేదని అన్నారు. ఇప్పుడు దాన్ని 3.5 శాతానికి కేంద్రం తగ్గించిందని చెప్పారు. అంటే కేంద్రం నిధులివ్వదు, అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వదని విమర్శించారు. కేరళ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నదని అన్నారు. అందరికీ టీకా కోసం రూ.వంద కోట్లు, ఆహార భద్రత కోసం రూ.రెండు వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. 2.50 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. అందులో 22 వేల ఇండ్లను ప్రజలకు కేరళ సీఎం పినరయి విజయన్ బుధవారం పంపింణీ చేశారని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను, లౌకిక పునాదిని, ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
భారతదేశంలో ప్రజారాజ్యం రావాలి : తమ్మినేని
విశాలాంధ్రలో ప్రజారాజ్యం రావాలని పుచ్చలపల్లి సుందరయ్య ఆకాంక్షించారనీ, భారతదేశంలోనే ప్రజారాజ్యం రావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సమసమాజం, సోషలిజం, కష్టజీవుల రాజ్యం సాధించాలని చెప్పారు. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా? అన్నది కాదనీ, కమ్యూనిస్టుల్లేకుండా భారతదేశానికి భవిష్యత్తు ఉందా?అని ప్రశ్నించారు. విద్యావైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే పేదలందరికీ భూమి, ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని అన్నారు. ఏపీ, తెలంగాణలో 60 శాతం మంది విద్యార్థులు ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్నారని చెప్పారు. అదే కేరళలో పది శాతం మంది విద్యార్థులే ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్నారని గుర్తు చేశారు. ఇదే ప్రత్యామ్నాయ విధానాలకు ఉన్న తేడా అని అన్నారు. ఈ విధానాలను బూర్జువా పార్టీలు అమలు చేయబోవనీ, కమ్యూనిస్టు పార్టీలే అమలు చేస్తాయని చెప్పారు. ఎస్వీకే ట్రస్టు సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వక్తలను ఎస్వీకే మేనేజింగ్ కమిటీ ఇన్చార్జీ కార్యదర్శి జి బుచ్చిరెడ్డి స్వాగతం పలికారు.