Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలరోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్నది 23.66శాతమే!
- దిగుబడి అంచనా 15లక్షల మెట్రిక్ టన్నులపైనే ..
- ఇప్పటివరకు సేకరించింది 3.54లక్షల మెట్రిక్ టన్నులే..
- కొనుగోలు కేంద్రాల్లో రైతుల అగచాట్లు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దిగుబడి అంచనాలో ఈనెల 16వరకు 23.66శాతమే కొన్నారు. ప్రతిరోజూ 60 వేల క్వింటాళ్ల వరకూ ధాన్యం సేకరిస్తున్నట్టు చెబుతున్నా.. అది లక్ష్యాన్ని చేరడం లేదు. ఒకవైపు ఆకాశంలో మబ్బులు.. మరోవైపు తీవ్ర ఎండలు రైతును ఆగం చేస్తున్నాయి. నిర్ధేశిత తేమ శాతం వచ్చినా రోజుల తరబడి వేచి ఉంటున్న రైతుల ఓపికను ఆసరా చేసుకుని 2 నుంచి 4కిలోలు అదనపు తూకం వేస్తున్నారు. వే బ్రిడ్జిపై లారీ బరువు తూకానికి.. మిల్లుకు వెళ్లాక ట్రక్‌షీట్‌లో మారుతున్న తూకానికి మధ్య తేడా రైతును నిండా ముంచుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత యాసంగి 9.25లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ ఏడాది 7.7లక్షల ఎకరాలకే పరిమితమైంది. సుమారు 2లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఇక దిగుబడి సైతం గతేడాది 18లక్షల మెట్రిక్ టన్నులు వస్తే.. ఈ ఏడాది 15లక్షల మెట్రిక్ టన్నుల వరకూ వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరిస్తున్న ప్రభుత్వం ఈనెల 16 వరకు 3.54లక్షల మెట్రిక్ టన్నులు (23.66శాతం) కొనుగోలు చేశారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.40లక్షల ఎకరాల్లో వరి సాగవగా 3లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఈ జిల్లాలో 252 కేంద్రాల్లో కొనుగోళ్లు చేస్తున్న అధికారులు ఈ నెల 16 వరకు 10,140 మంది రైతుల నుంచి 129.02కోట్ల విలువజేసే 65,826 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. జగిత్యాల జిల్లాలో 2.20లక్షల ఎకరాల్లో వరి సాగవగా కనీసంగా 4.70లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఈ నెల 15వరకు ఈ జిల్లా వ్యాప్తంగా 8,290 మంది రైతుల నుంచి రూ.139.93కోట్లు విలువజేసే 71,395 మెట్రిక్‌టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఏడాది 1.80లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 3.50లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 వరకు 13,523 మంది రైతుల నుంచి రూ.202.72కోట్ల విలువజేసే 1,03,460 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. కరీంనగర్ జిల్లాలో 2.30లక్షల ఎకరాల్లో వరి సాగవగా, సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఈ నెల 16 వరకు 16,054 మంది రైతుల నుంచి రూ.223.97కోట్ల విలువజేసే 1,14,267 మెట్రిక్ టన్నుల పంటను కొన్నారు.
కేంద్రాల్లో రైతుల వెతలు ఇవీ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రోజుకు 60 నుంచి 70వేల క్వింటాళ్ల వరకూ ధాన్యం సేకరిస్తున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఐకేపీ కేంద్రాల రోజుకు 30వేల క్వింటాళ్లు.. పీఏసీఎస్ ద్వారా 50వేల క్వింటాళ్లు, మార్కెట్ కమిటీల ద్వారా ప్రస్తుతం 5వేల క్వింటాళ్ల వరకు ధాన్యం సేకరిస్తున్న తెలుస్తోంది. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేశాక.. మిల్లులో దింపేకంటే ముందు వేబ్రిడ్జిలో తూకం వేస్తున్నారు. ఆ వే బ్రిడ్జిలో వచ్చిన బరువును బట్టి రైతులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వేబ్రిడ్జిలో వేసిన తూకానికి, మిల్లుల ట్రక్ షీట్‌కు మధ్య వ్యత్యాసం ఉంటోంది. ఇక మిల్లులోనే లారీలు, ప్రయివేటు వాహనాలు రోజుల తరబడి నిలిచిపోవడంతో కేంద్రాలకు వచ్చే వాహనాల సంఖ్య తగ్గుతోంది. దీంతో కొన్ని కేంద్రాల్లో లారీ వచ్చిన సమయంలో హమాలీలు ఉండటం లేదు. హమాలీలు వచ్చిన రోజు లారీలు సమయానికి రావడం లేదు. గన్నీ సంచి బరువు 600 గ్రాములు ఉండగా.. 40కిలోల బ్యాగులో 2 నుంచి 3కిలోలు అదనంగా తూకం వేస్తున్న పరిస్థితి దాదాపు అన్ని కేంద్రాల్లోనూ ఉంది. రోజుల తరబడి పనులు వదులుకుని కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ధాన్యం నిర్ధేశిత తేమ శాతం వచ్చినా కొనుగోలు చేయకపోవవడంతో ధాన్యం బరువు తగ్గి రైతులకు నష్టం తప్పడం లేదు. కొనుగోలు సమయం వచ్చే సరికి లారీలకు, హమాలీలకు డబ్బులు ఇవ్వాల్సి రావడం, తూకంలో తేడాలతోనూ రైతులు దోపిడికి గురవుతున్నారు. వీటికితోడు ఆకాశంలో మబ్బులు రైతులను ఆందోళనలో పడేస్తున్నాయి. వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఒక పరదాకు రోజుకు రూ.30చొప్పున కిరాయి పెట్టి ఒక్కో రైతు సగటున రోజుకు రూ.100 చెల్లించాల్సి వస్తోంది. ఇలా కేంద్రంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు అంత మొత్తం చెల్లించకతప్పడం లేదు.