Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇస్తే తప్పేంటని ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈ విధానాన్ని గత 30 ఏండ్ల క్రితం రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. సీఎం వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడం ద్వారానే అవి బలోపేతమవుతాయని చెప్పారు. పంచాయతీలకు వచ్చే నిధులను పెంచాలని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. కేసీఆర్ విధానాల వల్ల రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాకపోవడం వల్ల ఆత్మహత్యలే శరణ్యంగా మారాయని తెలిపారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతేడాది యాసంగికి 92 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసిందనీ, ఈ ఏడాది మే 17 వరకు కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగినట్టు అధికారికంగా ప్రకటించారని గుర్తు చేశారు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో రూ 1,400కే అమ్ముకున్నారని చెప్పారు. 69 లక్షల మంది మహిళ సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణం కింద రూ 3700 కోట్లు బకాయి ఉందనీ, ఆ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అభయ హస్తం పథకం కింద 22 లక్షల మంది మహిళా సంఘాల సభ్యుల సొంత డబ్బులు రూ 1,070 కోట్లు ప్రభుత్వం ఖజానాలో ఉన్నాయని గుర్తు చేశారు. వారి సొమ్మును ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు.