Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కింగ్స్ కాలేజ్‌తో ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి కే తారకరామారావు గురవారం లండన్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ హెడ్ ఫ్రాంక్ రాయట్‌తో భేటీ అయ్యారు. ఆ కంపెనీ విస్తరణ, తెలంగాణలో ఉన్న అవకాశాలపై చర్చించారు. దీనిపై ఫ్రాంక్ రాయట్ స్పందిస్తూ ఇప్పటికే హైదరాబాద్‌లో రూ. 710 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామనీ, 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. గడచిన రెండేండ్లలో రూ.340 కోట్లను హైదరాబాద్ ఫార్మాలో పెట్టుబడిగా పెట్టామన్నారు. థామస్ లాయిడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నందిత సెహగల్ తుల్లీ, పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అభివద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో కలిసి పని చేసేందుకు రియల్ సంస్థ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అనంతరం క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ ఛాన్స్లర్ పోల్లార్డ్తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్ యూనివర్సిటీపై చర్చించారు. హెచ్ఎస్బీసీ ప్రతినిధులు పాల్ మెక్ పియార్సన్, బ్రాడ్ హిల్ బర్న్‌లు మంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, త్వరలో దీనికి సంబంధించి స్పష్టమైన కార్యాచరణతో మరోసారి సమావేశమవుతామని తెలిపారు.
లండన్ కింగ్స్ కాలేజ్‌తో ఒప్పందం
ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కింగ్ కాలేజ్ పనిచేస్తుంది. యూకే పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్) కింగ్స్ హెల్త్ పార్ట్నర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. గురువారం లండన్ లోని కింగ్స్ కాలేజ్ క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. తాజా ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తన సహకారాన్ని అందిస్తుంది.