Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే నెల మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా పట్టణ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని కోరారు. పల్లె ప్రగతితో గ్రామాలు చక్కటి రూపాన్ని సంతరించుకున్నాయనీ, అదే స్థాయిలో మున్సిపాల్టీలు మాత్రం బాగుపడలేదని తెలిపారు. మొక్కల సంరక్షణ చేపట్టకపోతే మున్సిపల్ ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో సీఎస్‌తో సహా ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. ఐదు రకాలుగా చెత్తసేకరణ చేపడుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్టణం ఐదుసార్లు జాతీయ అవార్డు సాధించిందంటూ అవసరమైతే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సిబ్బందినీ, ప్రజా ప్రతినిధులను అక్కడి పర్యటనకు ప్రభుత్వం పంపిస్తుందని తెలిపారు. క్రీడా మైదానాల ఏర్పాటుకు సహకరించాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గ్రీన్ ఫండ్‌ను మున్సిపాలిటీల్లో ప్లాంటేషన్ కోసమే ఖర్చు చేయాలని ఆదేశించారు. అన్ని మున్సిపాల్టీల్లో ఒకే సమయానికి నీటి సరఫరా జరిగేలా చూడాలనీ, నీటి పన్నులు సక్రమంగా వసూలు చేయాలని దిశానిర్దేశం చేశారు. త్వరలోనే మున్సిపాల్టీల్లో ఇంజనీర్లు, శానిటేషన్ ఇన్స్ స్పెక్టర్లు, కమిషనర్ల నియామకాలు జరుగుతాయని తెలిపారు.