Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు
- అదే బాటలో మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్
నవతెలంగాణ- జైపూర్
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ కూడా హస్తం గూటికి చేరారు. ఈ దంపతులు గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వనించారు. టీఆర్ఎస్ నుంచి 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఓదేలు, అధిష్టానం సూచన మేరకు ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం 2010 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అదే సంవత్సరం జులైలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అప్పట్నుంచి అసంతృప్తిగా ఉన్నారు. అధిష్టానం ఆయన భార్య భాగ్యలక్ష్మీకి జడ్పీ చైర్పర్సన్ పదవి కట్టబెట్టడంతో మిన్నకుండిపోయారు. అయినప్పటికీ కొన్నాండ్లుగా పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ అదే రోజు రాత్రి భర్తతో కలిసి విమానంలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశమైంది. ఈ దంపతులు కాంగ్రెస్‌లో చేరే వరకు గోప్యత పాటించడం.. ఎక్కడా లీక్ కాకపోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. పార్టీలో సరైన గుర్తింపు, ఆదరణ లేకపోవడంతోనే పార్టీ మారానని మాజీ ఎమ్మెల్యే ఓదేలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌తోనే రైతులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌లో చేరినట్టు వెల్లడించారు.