Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు...
- డిపోల ఎదుట ధర్నాలు, నిరసనలు
- జూన్ 14న ఆర్టీసీ స్థితిగతులపై రాజకీయపార్టీలతో సదస్సు : టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయం
- యాజమాన్య తొత్తులుగా మారకండి
- టీఎమ్‌యూ రెండు గ్రూపులకు హితవు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో యాజమాన్య వేధింపులకు నిరసనగా ఈనెల 24న కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతారని 8 కార్మిక సంఘాలతో కూడిన టీఎస్ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆరోజు కార్మికులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలనీ, ఆయా డిపోల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పేరుచెప్పి డిపోల్లో కేఎమ్పీఎల్, కౌన్సిలింగ్, ఈపీకే పేర్లతో కార్మికులను అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎమ్డీ తక్షణం జోక్యం చేసుకొని అధికారుల్ని నియంత్రించాలని కోరారు. ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఎమ్డీ చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అది పచ్చి అబద్ధమని స్పష్టంచేశారు. శుక్రవారంనాడిక్కడి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్‌యూ) రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ సమావేశం చైర్మెన్ కే రాజిరెడ్డి (ఈయూ) అధ్యక్షతన జరిగింది. వైస్ చైర్మెన్ కే హనుమంతు ముదిరాజ్ (టీజేఎమ్‌యూ), కో కన్వీనర్ ఎస్ సురేష్ (బీడబ్ల్యూయూ), జేఏసీ నాయకులు జీఆర్ రెడ్డి (ఎస్‌డబ్ల్యూఎఫ్), స్వాములయ్య, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'కార్మిక చట్టాలను గౌరవించి వెంటనే ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను అనుమతించాలి. సిబ్బందిపై వేధింపులు తక్షణం మానుకోవాలి. పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి' అనే డిమాండ్లతో ఆర్టీసీ కార్మికుల కష్టనష్టాలతో కూడిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కార్మిక సంఘాల జేఏసీ ఏర్పడి 8 నెలలు అయ్యిందనీ, ఆర్టీసీకి ఎమ్డీ, చైర్మెన్ నియామకం జరిగి రోజులు గడిచాయనీ, కార్మికుల సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఇప్పటి వరకు వేచి చూసినట్టు వివరించారు. కానీ యాజమాన్యం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఇప్పటి వరకు జాతీయ కార్మిక సంఘాలు, రాజకీయపార్టీల మద్దతును తాము కోరలేదన్నారు. కానీ ప్రభుత్వం, యాజమాన్యం కార్మిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో తప్పనిసరై భవిష్యత్ పోరాటాలకు రాజకీయపార్టీల మద్దతును అడగవలసి వస్తున్నదని వివరించారు. దీనిలో భాగంగా జూన్ 14న రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల నాయకులతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. అక్కడ వచ్చే ప్రతిపాదనలు, సలహాలు, సూచనలను క్రోడీకరించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. నిజామాబాద్‌లో అధికారుల వేధింపులు భరించలేక బట్టలు విప్పి నిరసన తెలిపిన డ్రైవర్ గణేష్‌ను సస్పెండ్ చేయడాన్ని నాయకులు తప్పుపట్టారు. వేధింపులపై నిరసన తెలిపితే వాటికి పరిష్కారాలు చూపాలి కానీ, సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పనిభారాలు పెరిగాయన్నారు. కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు, ఆరు డిఏలు, 2013 వేతన సవరణ బకాయిలు, నైటవుట్ బత్తాలు, ఇతర అలవెన్సులు సహా ఏవీ ఇవ్వలేదన్నారు. ఒక్క రూపాయి అలవెన్సు కూడా పెంచకుండా కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని విమర్శించారు. పీఎఫ్‌కు రూ.1,400 కోట్లు, సీసీఎస్‌కు రూ.850 కోట్లు, ఎస్ఆర్బీఎస్కు రూ.398 కోట్లు, ఎస్బీటీ నుంచి 145 కోట్లు...మొత్తం రూ.2,793 కోట్ల సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సి ఉన్నదని వివరించారు.
యాజమాన్య తొత్తులుగా మారకండి
టీఎమ్‌యూ రెండు గ్రూపులకు జేఏసీ హితవు
టీఎమ్యూలోని రెండు గ్రూపులు యాజమాన్య తొత్తులుగా మారొద్దని జేఏసీ నేతలు హెచ్చరించారు. సంస్థలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఒత్తిళ్లు భరించలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఆ రెండు గ్రూపులు ఎలాంటి కార్యాచరణ ప్రకటించకుండా చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. తక్షణం టీఎమ్‌యూ రెండు గ్రూపులు జేఏసీలోకి వచ్చి, కార్మికుల పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు.