Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు అప్పులు తీర్చేందుకు బ్యాంకుల విముఖత
- ఆర్బీఐ చెప్పినా వినని బ్యాంకర్లు
- వడ్డీభారంతో ఆత్మహత్యలు
- రుణమార్పిడి అమలులో వ్యవసాయ శాఖ విఫలం
- బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంపై కోర్టులు సైతం ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అన్నదాతలకు రుణం గగనమేనా? ప్రయివేటు అప్పులే దిక్కా? ఆర్బీఐ చెప్పినా బ్యాంకులు పట్టించుకోవడం లేదా? రాష్ట్ర లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు రైతు శ్రేయోభిలాషులు. రైతు ప్రయివేటు అప్పులపాలైతే, వాటిని తీర్చేందుకు డెబిట్ స్వాపింగ్ లోన్ (డీిఎస్ఎల్) ఆర్బీఐలో పథకం ఉన్నట్టు వారికి కూడా తెలియదు. దాన్ని అమలు చేయని అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చు అనే నిబంధనలు ఉన్నాయి. అయినా అవి అమలు కావట్లేదంటే, బ్యాంకర్లు, అధికారులు ఎంత గోప్యంగా ఉంచుతున్నారో అర్థమవుతున్నది. ఆ పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరితే అలాంటిదేమీ లేదంటూ బ్యాంక్ మేనేజర్లు బుకాయిస్తున్నారు.
అప్పులతోనే రైతన్న ఆత్మహత్యలు
ఆర్బీఐ నిబంధనల ప్రకారం వ్యవసాయ రుణాలు 18 శాతం రైతులకు ఇవ్వాలి. దీంతోపాటు లాంగ్ టర్మ్ లోన్లు కలిపితే మొత్తంగా 40 శాతం రుణాలు ప్రతిఏటా రైతులకు చెల్లించాలి. అందులో సగానికి మించి రైతులకు రుణాలు అందడం లేదు. దీంతో రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. పంట నష్టపోయి పెట్టిన పెట్టుబడి రాక, ఆ అప్పులు తీర్చలేని రైతులకు రుణ మార్పిడి కోసం బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వడం లేదు. రైతుల ఆత్మహత్యలకు ప్రయివేటు అప్పులే కారణమని, అందుకు బ్యాంకులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్బీఐ పేర్కొంది.ఈ క్రమంలో వడ్డీకి వడ్డీ పెరిగిపోయి ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2004 నుంచి గతేడాది వరకు అప్పుపాలైన రైతులు 20వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. బ్యాంకుల అధికారులు రైతు గోడు వినడం లేదు. అరకొరగా పంటరుణాలిచ్చి బ్యాంకులు చేతులు దులుపుకున్నాయి.
పట్టించుకోని వ్యవసాయ శాఖ
పంట రుణాలు, రుణ మార్పిడి రుణం, లాంగ్ టర్మ్ రుణాలపై రైతులకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ విఫలమైంది. రైతుబంధు పర్యవేక్షణ తప్ప అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. రైతు రుణాల కోసం వారికి అవగాహన కల్పించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. రైతుకు కష్టమెచ్చినప్పుడు బ్యాంకర్లతో సంప్రదింపులు జరడపం, ఎస్ఎల్బీసీ అధికారులతో మాట్లాడం...రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి ఊరట కలిగించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. రుణ మార్పిడికి రుణాల ఇవ్వకపోతే సదరు బ్యాంక్ మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. దీనిపై ఇప్పటికే హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్బీఐ నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. వాటన్నింటిని బ్యాంకర్లు పెడచెవిన పెడుతున్నారు. దీంతో రైతులకు తీరని నష్టం జరుగుతుంది.
బ్యాంకుల నేరపూరిత చర్య
పాకాల శ్రీహరిరావు, అధ్యక్షులు, తెలంగాణ రైతు రక్షణ సమితి
రుణ మార్పిడికి సంబంధించిన రుణం ఇవ్వకపోవడం బ్యాంకుల నేరపూరిత చర్య. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమైన బ్యాంకుల నిర్లక్ష్య వైఖరి సరైందికాదు. ప్రయివేటు అప్పులు అధిక వడ్డీ భారంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలోని బ్యాంకు అధికారులు ఇక ముందు కూడా అవసరమున్న ప్రతి రైతుకు రుణ మార్పిడికి సంబంధించిన రుణాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే, వారిపై కఠినమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది. వారిపై కేసులు నమోదు చేయాలి.
బ్యాంకులు రుణం ఇవ్వకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం
టి సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం
రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతున్నది. ప్రయివేటు దీంతో వారు అప్పుల బారిన పడుతున్నారు. ఆర్బీఐ నిబంధనలు కూడా అమలు కావడం లేదు. పంట రుణాలే సక్రమంగా ఇవ్వడం లేదు. ప్రయివేటు అప్పులు తీర్చేందుకు బ్యాంకులు స్పందించడం లేదు. ఈ రెండు కారణాలతో రైతులు ప్రయివేటు అప్పులను ఆశ్రయిస్తున్నారు. రుణాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. భవిష్యత్తులో ఆందోళనలు చేపడతాం.