Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- రైతు ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు పరామర్శ
- ఢిల్లీ, పంజాబ్ సీఎంలు, దేవెగౌడ తదితరులతో భేటీ
- ఆర్థివేత్తలు, మీడియా సంస్థలతో సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అందులో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన అన్నదాతల కుటుంబాలను పరామర్శించనున్నారు. శనివారం సీఎం వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. జాతీయ మీడియా సంస్థల ప్రముఖులతోనూ సమావేశాలు నిర్వహిస్తారు. 22న మధ్యాహ్నం....ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తారు. రైతు ఉద్యమంలో కన్నుమూసిన పంజాబ్, హరియాణా ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ రాష్ట్రాలకు చెందిన సుమారు 600 మంది కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తారు.ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లతో కలిసి నిర్వహిస్తారు. 26న బెంగళూరు వెళ్లనున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో సమావేశమవుతారు. మే 27న రాలేగావ్ సిద్ధి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్కు తిరిగొస్తారు. ఆ తర్వాత మే 29 లేదా 30న పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు ఆయన సంసిద్ధం కానున్నారు. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు.
టిఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తవుతాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, నిర్మాణ సంస్థ ఎండీపీ ఇన్ఫ్రా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.