Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లు గడిచినా తట్టెడు మట్టి తీయలేదు
- వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్ పురోగతికి కృషి చేయాలి: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- ఎయిమ్స్ పరిశీలన.. డయాగ్నోస్టిక్ సెంటర్లకు స్థాపన
నవతెలంగాణ - భువనగిరి
తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణంలోని ఎయిమ్స్ ఆస్పత్రిని ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డితో కలిసి మంత్రి సందర్శించారు. అనంతరం భువనగిరి జిల్లా ఏరియాస్పత్రిలో ఆధునీకరించిన పీడియాట్రిక్ కేర్ యూనిట్ ప్రారంభోత్సవం, డయాగస్టిక్ రేడియాలజీ సేవల విభాగం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని వికేర్ ప్రయివేటు హాస్పిటల్లో ఫిజియోథెరఫీ డయాగస్టిక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య అధికారులతో రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. ముందుగా బీబీనగర్ నిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియ, డిప్యూటీ డైరెక్టర్ కర్నల్, ఎస్పీ అనంతరావు, భువనగిరి వైద్య శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల కిందట ప్రారంభించిన ఓపీ సేవలకే బీబీనగర్ నిమ్స్ పరిమితం కావడం బాధాకరమన్నారు. ఒక ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఇన్ పేషెంట్ వార్డు ఏర్పాటు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దమన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రం తరపున కూడా సౌకర్యాల కోసం కృషి చేయాలని, నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో భూసేకరణ చేపట్టినప్పటికీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. భూమి దస్తావేజులను తను ప్రదర్శిస్తే కేంద్రమంత్రి నోట మాట రావడం లేదన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్య మొదటి సంవత్సరంలో 50మంది, రెండో సంవత్సరంలో 62 మంది, 3వ సంవత్సరంలో 100 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. తాము నల్లగొండ, సూర్యాపేటలో వైద్య విద్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. అక్కడికి వెళ్లి మౌలిక సదుపాయాల కల్పన, విద్యా విధానాన్ని పరిశీలించాలని బీజేపీకి సూచించారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పలుమార్లు ప్రస్తావించి కొట్లాడితే తెలంగాణకు ఒక్క ఎయిమ్స్‌ను మంజూరు చేశారని, అందులోనూ సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు. ఎయిమ్స్‌లో చదువుతున్న వైద్య విద్యార్థులకు భువనగిరి ఏరియాస్పత్రిలో ప్రాక్టికల్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చామని చెప్పారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ అందిస్తే.. తమ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొక మెడికల్ కాలేజ్ చొప్పున 33 కళాశాలలు రాబోయే కాలంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1956 నుంచి 2014 వరకు రాష్ట్రంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే.. తాము వచ్చిన ఏడేండ్లలో 33 కళాశాలలకు శ్రీకారం చుట్టామని వివరించారు.
తెలంగాణ డయాగస్టిక్ సెంటర్‌కు రూ.కోటి 25 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. నవజాత ప్రత్యేక శిశువు కేంద్రాన్ని 46 లక్షలతో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. చిన్నపిల్లల హాస్పిటల్ ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపులు అమరేందర్, గ్రంథాలయ సంస్థల జిల్లా అధ్యక్షులు జడల అమరేందర్ గౌడ్, జిల్లా వైద్య అధికారి మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మెన్ చింతల కిష్టయ్య పాల్గొన్నారు.