Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూసివేసిన టీసీపీసీ సెంటర్లను పున:ప్రారంభించాలి
- 23న వికలాంగుల కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా : ఎన్పీఆర్డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసిన ట్రైనింగ్ కం ప్రొడక్షన్ సెంటర్ల(టీసీపీసీ)ను వెంటనే ప్రారంభించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎం.జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్, ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లపై ఈ నెల 23న వికలాంగుల కమిషనరేట్ ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న వికలాంగుల కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర సర్కారు పూనుకున్నదని విమర్శించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు సహాయ పరికరాలు అందక వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వికలాంగుల కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా సౌండ్ లైబ్రరీ, క్యాలిపర్స్ సెంటర్లు నిరుపయోగంగా మారుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. అంధులు, బధిరుల కోసం ఏర్పాటుచేసిన శిక్షణా కేంద్రాలు సైతం మూసి వేసే దశలో ఉన్నాయనీ, గతంలో ఐదు టీసీపీసీ సెంటర్లుంటే ప్రస్తుతం రెండే పనిచేస్తున్నా యని తెలి పారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పరికరాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వికలాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రం లోనూ వసతితో పాటు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్పొరేషన్ పరిరక్షణ కోసం దశలవారీగా ఉద్యమాలు చేస్తామనీ, 23న జరిగే కార్పొరేషన్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.