Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ చదువు వల్ల ఒకే గదిలో ఉన్న అన్నాచెల్లెలు
- రెండేండ్లుగా అఘాయిత్యం
- బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ఫిర్యాదుతో జువైనల్ హోంకు నిందితుడు
నవతెలంగాణ - దుండిగల్
కరోనా సమయంలో ఆన్లైన్ చదువు.. ఇంటర్నెట్ పిల్లల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.. పిల్లలు పొద్దస్తమానం ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోగా.. వారు ఏం చేస్తున్నారో కూడా కొందరు తల్లిదండ్రులు గమనించలేదు. ఈ క్రమంలోనే జరిగిన ఓ దారుణ ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుజూసింది. ఆన్లైన్ చదువు నేపథ్యంలో అన్నాచెల్లెలు ఒకే గదిలో కలిసి ఉండగా.. వక్రబుద్ధితో అన్న చెల్లెలిపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఇటీవల బాధితురాలు గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. పోలీసులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
కేరళకు చెందిన ఓ కుటుంబం చాలా ఏండ్ల కిందట నగరానికి వలసొచ్చింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లిలోని కాసాని కౌసల్య కాలనీలో నివాసం ఉంటోంది. కుటుంబ యజమాని వ్యాపారి కాగా.. అతని భార్య సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరికి ఓ కొడుకు(17), కూతురు(14) ఉన్నారు. కొడుకు స్థానికంగా ఓ ఇంటర్నేషనల్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కూతురు మరో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది.
అయితే, కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో రెండేండ్లుగా అన్నాచెల్లెలిద్దరూ ఒక గదిలో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో బాలికను లొంగదీసుకున్న ఆమె సోదరుడు రెండేండ్లు లైంగికదాడి చేశాడు. ఆరునెలల కిందట బాలిక రజస్యల కావడం, ఇటీవల గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లి హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. బాలిక గర్భవతి అని తేలింది. దీంతో తల్లిదండ్రులు మూడ్రోజుల కిందట ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు బాచుపల్లి పోలీసులు బాలుడిపై ఫోక్సో కేసును నమోదు చేశారు. అనంతరం జువైనల్ హోంకు తరలించారు. బాధిత బాలికను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.