Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొల్లకుర్మ ఐక్య వేదిక నాయకుల డిమాండ్
నవతెలంగాణ-బోధన్
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో గొల్ల కుర్మలపై దాడి చేసిన గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గొల్లకుర్మ ఐక్యవేదిక నాయకులు రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బోధన్ పట్టణంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గొల్లకుర్మలు ప్రతి గొర్లమందకు రూ.20వేలు, 15 గొర్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీన్ని వ్యతిరేకించిన గొల్ల కుర్మలపై వీడీసీ సభ్యులు దాడి చేసి, గొర్లను నిర్బంధించారని, ఇలాంటి అనాగరికత చర్యకు ఒడిగట్టడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి స్పందించి వీడీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి టీఎమ్మార్పీఎస్ నాయకులు విద్యాసాగర్, లింగయ్య, మాలమహానాడు నాయకులు మొగులయ్య మద్దతు ప్రకటించారు. సమావేశంలో ఐక్యవేదిక నాయకులు నక్క లింగారెడ్డి, వీరయ్య, భరత్ యాదవ్, వెంకటేశ్ యాదవ్, శంకర్, పోశెట్టి, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.