Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వీపీ సాను, మయూక్ బిశ్వాస్
నవతెలంగాణ-భూపాలపల్లి
విద్యారంగంలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణను ప్రోత్సహించే నూతన విద్యా ముసాయిదాను తిప్పి కొట్టాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వీపీ సాను, మయూక్ బిశ్వాస్ పిలుపునిచ్చారు. మే 20, 21 తేదీల్లో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నవంబర్ 3 నుంచి 6 వరకు రంగారెడ్డి జిల్లాలో 17వ అఖిలభారత మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. చారిత్రక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కలిగిన తెలంగాణ గడ్డపై ఈ మహాసభలు జరగనుండటంతో మహాసభలు మరింత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయన్నారు. కేంద్రంలో డిజిటల్ విద్య పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. డిజిటల్ విద్య అంటే అంబానీ, అదానీలకు దోచిపెట్టడమేనన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు మాట్లాడుతూ.. 2022-23 విద్యా సంవత్సరానికి వరకు పాఠ్య పుస్తకాల ముద్రణ, యూనిఫారం తయారీ చర్యలు ప్రారంభం కాలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయని, శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, కళాశాలలు సంక్షేమ హాస్టళ్లకు మరమ్మతులు చేపట్టలేదని తెలిపారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళకు సొంత భవనాలు లేవన్నారు. వేల కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అడపా సంతోష్, జిల్లా కార్యదర్శి దామెర కిరణ్, కిషోర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి, జీఎస్ఎస్సీ కన్వీనర్ పూజ, కోకన్వినర్ మిశ్రిన్తోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరుల పాల్గొన్నారు.