Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనిఫామ్ సర్వీసులకు వర్తింపు
- గతంలోనే మూడేండ్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
- దరఖాస్తు గడువు 26 వరకు పొడిగింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా మహమ్మారి కారణంగా రెండేండ్ల విలువైన కాలాన్ని తెలంగాణ నిరుద్యోగ యువత కోల్పోయిన నేపథ్యంలో వయోపరిమితిని పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలంటూ టీపీసీసీ అధ్యక్షులు ఎ రేవంత్‌రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు పలు సంఘాలు సైతం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసు అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు పొడిగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్, డీజీపీ ఎం మహేందర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. అందుకనుగుణంగా సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే నోటిఫికేషన్లు జారీ చేసిన సమయంలోనే యూనిఫాం సర్వీసు పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు పెంచింది. దీంతో పోలీసు అభ్యర్థుల వయోపరిమితి సడలింపు ఐదేండ్లు కానుంది. పోలీసు, అగ్నిమాపక, రవాణా, జైళ్లు, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, అటవీ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులకు వర్తించనుంది. ఈ వయోపరిమితి సడలింపు రెండేండ్లపాటు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు-2018ని తెచ్చింది. పోలీసు ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని పెంచడంతో దరఖాస్తు గడువును సైతం ప్రభుత్వం పొడిగించింది. పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో 15,644 కానిస్టేబుల్, 554 ఎస్సై, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్, 383 కమ్యూనికేషన్ కానిస్టేబుల్, 63 రవాణా కానిస్టేబుల్, 33 వేలిముద్రల ఏఎస్సై పోస్టులు కలిపి మొత్తం 17,291 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల రెండో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి పది గంటల వరకు దరఖాస్తు చేసేందుకు షెడ్యూల్ ప్రకారం గడువున్నది. అయితే అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు పెంచడంతో మరికొంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడిగించినట్టు పోలీసు నియామక మండలి చైర్మెన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు పది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు సమాచారం. వయోపరిమితితోపాటు దరఖాస్తు గడువు పొడిగించడంతో మరింత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశమున్నది.
పోస్టుల వారీగా వయోపరిమితి సడలింపు
- కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు కనిష్ట వయస్సు 18 ఏండ్లు. సాధారణ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 22 ఏండ్లుగా ఉన్నది. ఇకపై ఈ పరిమితి 27 ఏండ్లు అవుతుంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులకు ప్రస్తుతం 27 ఏండ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లకు పెరగనుంది.
- ఎస్సై ఉద్యోగాలకు కనిష్ట వయస్సు 21 ఏండ్లు. సాధారణ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లుగా ఉన్నది. ఇకపై అది 30 ఏండ్లకు చేరుతుంది. ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రస్తుతం 30 ఏండ్లు గరిష్ట వయోపరిమితి ఉండగా, అది 35 ఏండ్లకు పెరగనుంది.
- డీఎస్పీ పోస్టులకు కనిష్ట వయోపరిమితి 21 ఏండ్లు. సాధారణ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లుగా ఉన్నది. ఇకపై అది 35 ఏండ్లకు పెరగనుంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 35 నుంచి 40 ఏండ్లకు పెరుగుతుంది. ఇంకోవైపు డీఎస్పీ పోస్టులకు అభ్యర్థుల ఎత్తును 167 సెంటీమీటర్ల నుంచి 165 సెంటీమీటర్లకు ప్రభుత్వం తగ్గించింది.