Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 170 సీట్లను కోల్పోయిన వైనం
- నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ప్రక్రియే కారణం
- సర్కారు జోక్యం చేసుకోవాలని కోరుతున్న బాధితులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గత మూడేండ్లుగా మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది సైతం అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ రిజర్వ్డ్ వర్గాలకు దక్కాల్సిన దాదాపు 170 సీట్లను ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులకు అన్యాయంగా కట్టబెట్టారని పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మొత్తం సీట్లలో 50 శాతం వరకే ఓపెన్ కోటా (ఇందులో మెరిట్ ప్రాతిపదికన అన్-రిజర్వ్డ్ వర్గాల విద్యార్థులతో పాటు రిజర్వ్డ్ వర్గాల వారు ఉంటారు.) ఉండాలి. ఆ తర్వాత 50 శాతం సీట్లలో కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర రిజర్వ్డ్ వర్గాలకు చెందిన విద్యార్థులుండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. నిబంధనలు కచ్చితంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్‌లో మొదటి 50 శాతం సీట్లకు మాత్రమే ఎఫ్సీలుండగా, ఆ తర్వాత 50 శాతం సీట్లలో రిజర్వ్డ్ అభ్యర్థులున్నారు. అయితే తెలంగాణలో అడ్మిషన్లు పొందిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే అందుకు భిన్నంగా ఉండటమే అన్యాయం జరిగిందనేందుకు ఉదాహరణ అని బీసీ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.
2001లో ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీవో 550 ప్రకారం చూసినా, నితీష్ ఆర్ షా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూసినా మొదట ఓపెన్ కోటా సీట్లను మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేయాలి. ఓపెన్ కోటాలో సీటు పొందిన రిజర్వ్డ్ అభ్యర్థి కోరుకున్న కాలేజీ లేదా కోర్సు రాని పక్షంలో అతడు రిజర్వ్ ్ కోటాలో మార్చుకుంటే ఆ ఓపెన్ కోటాలో మిగిలిన సీటును అదే కేటగిరీకి చెందిన రిజర్వ్డ్ అభ్యర్థికి కేటాయించాలి. అయితే ఈ నిబంధనలను కచ్చితంగా అమలు కాకపోవడానికి ప్రతి దశ కౌన్సిలింగ్లో అభ్యర్థులకు ప్రత్యేకంగా వెబ్ ఆప్షన్ ఎంచుకునే అవకాశముండటమే కారణమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వాదిస్తూ వస్తున్నది. దీంతో రిజర్వ్ డ్ వర్గాలకు చెందిన ఉద్యమకారులు ఆ శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి తమ వర్గాల పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. దీంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గతేడాది డిసెంబర్ 29న సంబంధిత నిబంధనలను సవరిస్తూ జీవో నెంబర్ 187ను విడుదల చేసింది. తమ న్యాయం జరుగుతుందని భావించినా తిరిగి అన్యాయమే జరిగిందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెటండో దశ కౌన్సిలింగ్లో రిజర్వ్డ్ సీట్ల భర్తీ చేపట్టడమే గందరగోళానికి కారణమని చెబుతున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆంధ్రా రీజియన్ పరిధిలో 1,676 మెడికల్ సీట్లు ఉండగా అందులో సగం 833 వద్ద ఓపెన్ కోటా సీట్లు పూర్తిగా అయిపోగా, అక్కణ్నుంచి మిగిలిన సగం సీట్లు రిజర్వ్డ్ అభ్యర్థులకే వచ్చాయి. అదే తెలంగాణలో కాళోజీ విశ్వవిద్యాలయం చేపట్టిన కౌన్సిలింగ్లో మొత్తం కన్వీనర్ సీట్లు 2,958 కాగా అందులో 1,480 వద్ద అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు కేటాయింపు ఆగిపోవాలి. కానీ ఆ తర్వాత కూడా 170 మంది ఎఫ్‌సీ అభ్యర్థులు సీట్లు పొందారనీ, 1,480 నుంచి 1,892 సీరియల్ నెంబర్ల మధ్య ఆయా అభ్యర్థులకు కేటాయించడం ఎలా సాధ్యమైందని వారు ప్రశ్నిస్తున్నారు. ఫేజ్-1లో జీవో నెంబర్ 550 అమలు చేయకుండా ఓపెన్ కోటాలో మొక్కుబడిగా 50 నుంచి 60 మందికి ఇచ్చి మమ అనిపిస్తున్నారని బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
పీజీ సీట్లలో ఓపెన్ కోటాలో రిజర్వ్డ్ అభ్యర్థి సీటు పొంది దాన్ని వెకేట్ చేస్తే ఆ సీటును అదే కేటగిరీకి చెందిన అభ్యర్థితో భర్తీ చేయాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నా అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇందు కోసం సంబంధిత జీవోలను సవరించాలని పలువురు కోరుతున్నారు.
నిబంధనల మేరకే : డాక్టర్ కరుణాకర్ రెడ్డి
ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ నిబంధనల మేరకే జరిగిందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. నవతెలంగాణ ప్రతినిధి వివరణ కోరగా రిజర్వ్ డ్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణ సరైంది కాదని కొట్టిపారేశారు. ఓపెన్ కోటాలో వచ్చిన వారిలో కొంత మంది బెటర్ కాలేజీ కోసం మార్చుకోవడం ద్వారా ఎఫ్‌సీలకు ఎక్కువగా సీట్లు వచ్చి ఉండొచ్చని చెప్పారు. అదే సమయంలో ఓపెన్ కోటాలో రిజర్వ్డ్ అభ్యర్థులకూ సీట్లు వచ్చాయన్నారు.
రిజర్వ్డ్ అభ్యర్థులకు న్యాయం చేయాలి : డాక్టర్ స్వామి
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిబంధనల మేరకు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అర్హతున్నా సీట్లు కోల్పోయారని ప్రముఖ పీడియాట్రీషియన్, బీసీ నాయకులు డాక్టర్ స్వామి తెలిపారు. భవిష్యత్తులో యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియను నిబంధనల మేరకు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావును కలిసి ఫిర్యాదు చేస్తామనీ, న్యాయం కోసం కోర్టును సైతం ఆశ్రయిస్తామని చెప్పారు.