Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు రైతుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం
- దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు పూర్తి
- అటవీ సంరక్షణ కమిటీలు పేరుకే పరిమితం
- కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 40 వేల దరఖాస్తులు
- పాస్‌బుక్కులు రాక పథకాలకు రైతులు దూరం
నవతెలంగాణ-లింగంపేట్
ఎన్నికల్లో గెలిచిన అనంతరమే పోడు రైతుల భూ సమస్యను పరిష్కరిస్తానని' 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఆ మాటే మరిచింది. గతేడాది నవంబర్‌లో ఆర్భాటంగా పోడు రైతుల భూ సమస్యను పరిష్కరించేందుకు దరఖాస్తులు కోరింది. దరఖాస్తుల స్వీకరణకు గ్రామస్తులు, సర్పంచ్, అటవీ, రెవెన్యూ అధికారుల భాగస్వామ్యంతో అటవీ సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. దరఖాస్తులు స్వీకరించిన కమిటీలు.. వాటిని ఉన్నతాధికారులకు చేరవేశారు. ఈ తతంగం అంతా గడిచి ఆరు నెలలవుతున్నా.. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం సడిసప్పుడు చేయడం లేదు. పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతులు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. గాంధారి మండలంలో అధికంగా 12 వేల దరఖాస్తులు వచ్చాయి. లింగంపేట్‌లో 5600, ఎల్లారెడ్డిలో 4080 దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను పరిష్కరించి పోడుభూముల రైతులకు పట్టాలివ్వడానికి ప్రభుత్వం గ్రామగ్రామాన అటవీ సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు రైతుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎన్నేండ్ల నుంచి వారు సాగులో ఉన్నారనే వివరాలను తెలుసుకొని అటవీ, రెవెన్యూ శాఖల అధికారులకు నివేదికలు అందించాల్సి ఉంది. కాగా ఈ దరఖాస్తులన్నీ డీపీవో పరిధిలో కలెక్టరేట్‌కు చేరుకున్నా యి. కానీ ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తూ పరిశీలించింది లేదు.. రైతులకు పట్టాలిచ్చిన దాఖలాలు లేవు.
వర్షాకాలం సీజన్ పోయి రబీ వచ్చి మళ్లీ వర్షాకాలం సీజన్ వస్తున్నా రైతులకు మాత్రం పట్టాపాస్‌బుక్కులు అందడం లేదు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు పోడు రైతులు దూరమవుతున్నారు. రైతుబంధు, రైతుబీమా అందకపోగా, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పొందలేకపోతున్నారు. రుణాలు సైతం అందడం లేదు. వేలాది దరఖాస్తులు కాగితాలకే పరిమితమైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులు.. పరిష్కారం లభిస్తుందోనని ఆతృతతో కార్యాలయాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా ఈ విషయమై వివరణ కోరగా.. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేవని, వారి నుంచి ఆదేశాలు రాగానే దరఖాస్తుల పరిశీలన ప్రారంభిస్తామని చెప్పడం గమనార్హం.
పట్టాలివ్వకుంటే ఆందోళన
పోడు సాగుదారుల భూములకు పట్టాలిస్తామని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకొని ఇప్పటివరకు పరిష్కరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.
- మోతిరామ్ నాయక్. రైతు సంఘం జిల్లా కార్యదర్శి. కామారెడ్డి
ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా
కొన్నేండ్లుగా మూడెకరాల్లో పంటలు సాగు చేసుకుంటూ బతుకుతున్నా. పట్టా పాస్ పుస్తకం కోసం ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు పట్టాలివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుతం సూచనతో పట్టాలు వస్తాయని ఆశతో దరఖాస్తు చేసుకు న్నా.. ఏం చెప్తలేరు. పాస్బుక్కు లేదని రైతుబంధు వస్తలే. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇస్తలేరు.
- భాస్కర్ నాయక్. సోమర్యాగడి తండా