Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్ రెండో తేదీన ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమర వీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారనీ, అనంతరం పబ్లిక్ గార్డెన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని చెప్పారు. ఆ రోజు సాయంత్రం రవీంద్రభారతిలో 30 మంది ప్రముఖ కవులచే కవిసమ్మేళనం నిర్వహిస్తామన్నారు.
ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హౌం శాఖ కార్యదర్శి రవిగుప్త, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జల మండలి ఎమ్డీ దాన కిషోర్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలతో పాటు పోలీసు, రోడ్లు భవనాలు, విద్యుత్, సమాచార, ఉద్యాన వన శాఖ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పండుగగా భాగ్యరెడ్డివర్మ జయంతి..ఉత్తర్వులు జారీ
ప్రముఖ సంఘ సంస్కర్త, దివంగత భాగ్యరెడ్డి వర్మ 134 జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22న భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ జీవో నెంబర్ 1045ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు, వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.