Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి డిమాండ్లను పరిష్కరించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలు తలపెట్టిన చలో సీసీఎల్ఏ కార్యక్రమానికి వచ్చిన వీఆర్ఏలను అక్రమంగా అరెస్టు చేయడం సరిగాదనీ, పోలీసుల వైఖరిని ఖండిస్తున్నట్టు సీఐటీయూ ప్రకటించింది. ఈ మేరకు ఆ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి వీఆర్ఏలకు ఇచ్చిన పేస్కేలు, వారసత్వ ఉద్యోగాల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల పోరాటానికి కార్మికవర్గం అండగా ఉంటుందని ప్రకటించారు.
వీఆర్ఏల పేస్కేలు అమలు చేయాలి..పోలీసుల దాడి ఆక్షేపనీయం : ట్రెసా
శాంతియుతంగా సీసీఎల్ఏ కార్యాలయానికి వస్తున్న వీఆర్ఏలపై పోలీసుల దాడిని ఆక్షేపనీయమనీ, వారికి ఇచ్చిన పేస్కేలు హామీని వెంటనే నెరవేర్చాలని ట్రెసా డిమాండ్ చేసింది. ఈ మేరకు ట్రెసా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర సర్కారుకు ట్రెసా పలుమార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. వీఆర్ఏలను, జేఏసీ నాయకులను నిర్బంధించడం సబబు కాదని పేర్కొన్నారు. పోలీసుల తీరు వల్ల ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు వస్తుందనీ, ఇలాంటి చర్యలను మానుకోవాలని సూచించారు. చాలీచాలని వేతనాలతో సతమతం అవుతున్న వీఆర్ఏలు తమ గోడును రెవెన్యూ ఉన్నతాధికారులకు చెబుకుందాని వస్తే వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని వీఆర్వో సంఘాల జేఏసీ నేతలు గోల్కొండ సతీశ్, గరికె ఉపేందర్‌రావు, రవినాయక్, హరాలే సుధాకర్‌రావు, పి.నరేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీఆర్ఏల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ/వీఆర్ఓ సంఘాల గౌరవాధ్యక్షులు వింజమూరి ఈశ్వర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీఆర్ఏల ఐక్యతను స్వాగతిస్తున్నట్టు తెలిపారు.