Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నీరజ్ హంతకులను కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లులక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. ' బేగంబజార్ నివాసి, మార్వాడి కులానికి చెందిన నీరజ్ పన్వర్-యాదవ కులానికి చెందిన సంజన ప్రేమించుకుని ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. కులాంతర ప్రేమ వివాహం కావడంతో తమ పరువు పోయిందంటూ సంజన కుటుంబ సభ్యులు వారిని హతమారుస్తామనీ అప్పట్నుంచి బెదిరిస్తూనే ఉన్నారు. దీంతో నీరజ్-సంజన అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలని కోరారు. ఈ కేసును సున్నితంగా పరిశీలించి వీరికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు సక్రమంగా స్పందించలేదు. ఫలితంగా ఈ నెల 20న నిందితులు అత్యంత దారుణంగా నీరజ్‌పై కత్తులతో దాడి చేసి నడిరోడ్డుపై చంపేశారు.....'అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటున్న వారిని ప్రోత్సహించి వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సరైన పద్ధతిలో వ్యవహరించక పోవడం వల్లే ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరూర్‌నగర్‌లో కుల దురహంకార హత్యకు గురైన నాగరాజు హత్యను మరవకముందే తాజాగా నీరజ్ హత్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.