Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం బూడిదపాడు గ్రామంలో ఉపాధి కూలి పనికి వెళ్తూ ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలనీ, చట్ట ప్రకారం వేతనం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.ఆంజనేయులు జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 'ఈ నెల 18న 40 మంది కూలీలు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ట్రాలీ ఒరగడంతో అందులో ఉన్న మహిళా కూలీలందరు కిందపడిపోయారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బొచ్చు వెంకటమ్మ అనే కూలీ ఎడమ చెయ్యి విరిగింది. కృష్ణవేణి భర్త సురేందర్ రెడ్డి, సత్యమ్మ భర్త హన్మంతు, నరసింహ తండ్రి బలరాం, శాంతమ్మ భర్త వెంకటయ్య, రేణుకమ్మ భర్త లక్ష్మన్నల కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని ....' వారు తెలిపారు. గాయపడ్డ వారు తిరిగి కోలుకునే వరకు రోజు కూలి రూ.257 చెల్లించాలనీ, వారి వైద్యానికయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరించాలనీ, తక్షణ సాయం కింద రూ.ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. బాధితులకు నాలుగైదు వారాల పాటు చేసిన పనికి చెల్లించాల్సిన కూలీ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలను జీపీ ట్రాక్టర్ల ద్వారా పనుల దగ్గరకు చేర్చాలనీ , ట్రాక్టర్లకు లోకల్ ఆటో చార్జీలను చెల్లించే విధంగా ఆదేశాలివ్వాలని కోరారు. గాయపడ్డ కూలీల కుటుంబాలకు మనిషి 50 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించాలని డిమాండ్ చేశారు.