Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ హయాంలో భూకబ్జాలు :పొన్నాల లక్ష్మయ్య
నవతెలంగాణ-కొమురవెల్లి
సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను పూర్తిగా కొల్లగొట్టిందని మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డితో కలిసి శనివారం ఆయన వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అల్లాడుతున్నా పట్టించుకునే వారేలేరన్నారు. రోజులు గడుస్తున్నా ధాన్యం కాంటాలు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లను కొనబోమని, వరి వేస్తే ఉరి అని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో చెప్పి.. రైతులు వరి సాగు చేసుకోకుండా ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి 50 శాత వరి సాగు వదిలేశారని, వచ్చిన దిగుబడినీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కొనుగోళ్లు చేపట్టారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం భూ కబ్జాలకు తెర లేపితే.. స్థానిక ఎమ్మెల్యే కూడా భూములను కబ్జా చేసి జనగామ నియోజకవర్గంలో కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మద్దూరు జెడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వకుళాభరణం నరసయ్య పంతులు, కొమురవెల్లి, చేర్యాల కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగే గురువయ్య గౌడ్, ఆది శ్రీనివాస్, ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.