Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు సీతారామ ప్రాజెక్టు కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
గ్రామానికి చెందిన పూరేటి బాబురావు(40), రాయి ముత్తయ్య(38) సీతారామ ప్రాజెక్టు కాలువ వద్దకెళ్లారు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతిచెందారు. పక్కనున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గణేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇద్దరికీ వివాహం అయింది.
ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే.. : సీపీఐ(ఎం)
సీతారామ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు ప్రాణం కోల్పోయారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యాస నరేష్ అన్నారు. ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి బాధిత కుటుంబాలకు రూ.20 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం చొప్పున ఇవ్వాలని ఆందోళన చేశారు. సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం అసంపూర్తిగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని టీడీపీ వైరా నియోజకవర్గ నాయకులు ఆరెం రామయ్య అన్నారు. సంవత్సరాలుగా పనులు సాగుతున్నాయని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. కాంట్రాక్టర్ స్పందించి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.