Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ అరవింద్ నోరు తెరిస్తే అబద్ధాలే..
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ - మెట్పల్లి
తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదని, మతాల మధ్య చిచ్చుపెట్టి.. యువతను పెడదోవ పట్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావాలని రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల్లోని యువత అందుకు సన్నద్ధం అయ్యేలా స్థానిక నాయకులు వారికి దిశానిర్దేశం చేయాలన్నారు. స్థానికతకు సంబంధించిన జీవోను రెండేండ్లపాటు కేంద్రం పెండింగ్లో పెట్టినా ఓపిక పట్టామని చెప్పారు. గ్రామీణ యువత మతతత్వ పార్టీ వైపు వెళ్లకుండా చూడాలని చెప్పారు. మతం పేరుతో రాజకీయం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరల పెంపులో అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. జీడీపీ పాతాలంలో ఉంటే ధరలేమో ఆకాశాన్నంటుతున్నాయన్నారు. అభివృద్ధిలో కాకుండా అబద్దాలాడటంలో పోటీపడుతున్నారన్నారని, దేశంలోని ప్రజల మధ్య కులం, మతం పేరుతో చీలికలు తీసుకొచ్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారి పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.మోసపూరిత హామీలతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన ధర్మపురి అరవింద్ నోరు తెరిస్తే అబద్ధాలేనని విమర్శించారు. పసుపు బోర్డు గురించి అడిగితే.. స్పైస్ బోర్డు తెచ్చానని, పసుపుకు ధర వస్తుందని ఏదిపడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను కూడా తామే చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.