Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు
- క్వింటాలు ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర
- రచ్చబండ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-కందుకూరు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే దఫా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో 'రైతు రచ్చబండ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భట్టి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఉద్యోగాలు, వనరులు, సాగునీరు, తాగునీరు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజలకు దక్కాలని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచి, వనరులను దోచుకుతింటున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వరి ధాన్యం క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు పంంచిన భూములను ఇప్పుడు సీఎం కేసీఆర్ బలవంతంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.5 వేల రైతుబంధు ఇచ్చి, యంత్రాల సబ్సిడీ, పావలా వడ్డీ, రుణమాఫీని గాలికి వదిలేశారని విమర్శించారు. రేషన్‌లో నాణ్యత లేని బియ్యం ఇచ్చి, తొమ్మిది రకాల సరుకులను రద్దు చేశారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి, రెచ్చగొట్టే ప్రసంగాలతో హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెడుతూ.. దేశాన్ని ముక్కలు చేయడానికి చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదులో ఏముంది, గుడి కింద ఏముంది అంటూ అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ అభివృద్ధిని గాలికి వదిలేసిందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను అంతులేకుండా పెంచుతోందన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని.. ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రస్తావించి, వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి శివ కుమార్, జానకిరామ్, ఎన్ఎస్యూఐ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, వంగేటి, ప్రభాకర్ రెడ్డి, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, యువజన విభాగం మహేశ్వరం నియోజకవర్గ నాయకులు దేపా భాస్కర్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రవికాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.