Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్న వ్యాపారస్తులు
- మద్దతు ప్రకటించిన ఆయా పార్టీల నాయకులు
- నీరజ్ కుటుంబీకుల రాస్తారోకో
- ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిందితులను శిక్షించాలని డిమాండ్
నవతెలంగాణ-ధూల్‌పేట్
హైదరాబాద్ నగరంలో వ్యాపార కేంద్రమైన బేగంబజార్ శుక్రవారం రాత్రి జరిగిన కులదురహంకార హత్యను నిరసిస్తూ శనివారం వ్యాపారులు మార్కెట్ బంద్ చేశారు. మార్కెట్లో కనీస భద్రతలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా వెళ్లి షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. అక్కడి నుంచి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో నీరజ్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతోనే నీరజ్‌ను హత్యచేశారని, ఫాస్ట్ ట్రాక్‌కోర్టు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని నినదించారు. ఇటీవల సిటీలో ఏదో ఒక పేరుతో హత్యలు జరుగుతున్నాయని, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో చొరబడి, నడి రోడ్లపై దుండగులు దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారస్తులకు, ప్రజలకు కనీస భద్రత లేకుండా పోయిందని ఆందోళన చెందారు. బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మార్కెట్లోని వివిధ వ్యాపార అసోసియేషన్ నాయకులు, సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి : సీపీఐ(ఎం)
హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకొని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. హత్యను నిరసిస్తూ బేగంబజార్ వ్యాపారస్తులు చేపట్టిన బంద్, రాస్తారోకోలో సీపీఐ(ఎం) నాయకులు శ్రావణ్ కుమార్, పి.నాగేశ్వర్, ఐద్వా నాయకులు శశికళ, లక్ష్మమ్మ పాల్గొని సంఘీభావం తెలిపారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే రాజాసింగ్
నీరజ్ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. బేగం బజార్ వ్యాపారస్తుల ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. నీరజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కఠిన శిక్ష పడేలా చూడాలి : టీఆర్ఎస్ నాయకులు
నీరజ్ హత్య కేసులో నిందితులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారని, వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నందకిశోర్ వ్యాస్ పోలీసులను కోరారు. బేగం బజార్ కార్పొరేటర్ పూజా వ్యాస్‌తో కలిసి నీరజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.