Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత ఇంటికి నోచుకుని భవన నిర్మాణ కార్మికులు
- శ్రమకు తగ్గ వేతనం కరువు
- కార్మికుల శ్రమను దోచుకుంటున్న రియల్టర్లు
- నిర్లక్ష్య ధోరణిలో కార్మిక శాఖ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర రాజధానికి శివారు ప్రాంతమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నిర్మాణ రంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతుంది. కానీ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల జీవన పరిస్థితులు మాత్రం రోజు రోజుకు దిగజారుతున్నా యి. రంగారెడ్డి జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 లక్ష మంది ఉన్నారు. నిర్మాణ రంగంలో అత్యధికులు వలస కార్మికులే. కాంట్రాక్టు పద్దతిలో ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి రాత్రింబవళ్లు పని చేయిస్తున్నారు. వారితో విశాలమైన భవనాల నిర్మాణాలు పనులు చేయిస్తూ..వారిని మాత్రం పందుల షెడ్లలాంటి రేకుల షెడ్లు నిర్మించి ఒక్కో షెడ్లో రెండు, మూడు కుటుంబాలు.. లేదంటే 8నుంచి 10మందిని కుక్కుతున్న పరిస్థితి నెలకొంది.
ఇందుకు నిదర్శనం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని సంజీవని డెవలపర్స్ కంపెనీ వందల ఎకరాల్లో విశాలమైన భవన నిర్మాణాలు చేపడుతుంది. ఇక్కడ సుమారు 3 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికులు. వీరు ఇక్కడ నాలుగేండ్లుగా పనిచేస్తున్నారు. వీరి కోసం ఏర్పాట్లు చేసిన గుడిసెలు వర్షాలకు, ఈదురుగాలులకు కూలిపోతున్నాయి. ఒక్కో గుడిసెలో రెండు, మూడు కుటుంబాలను ఉంచుతున్నారు. గుడిసెల్లోకి ఎప్పుడు ఏమిు వస్తుందోనని భయాందోళనతో బతుకిడ్చుతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 3 వేల మంది కార్మికులు నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతాల్లో వారికి కనీస వసతులు లేవు. చుట్టూ ఎటు చూసినా అటవీ ప్రాంతం. తాగునీటి కోసం రెండు కిలోమీటర్లు నడవాల్సిందే. ఇక ఆరుబయటికి వెళ్లాలంటే కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితి అని మహిళ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాత్రయితే మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతటి సమస్యలను తట్టుకుని పనిచేస్తున్న కార్మికుల దినసరి వేతనం 12 గంటలకు.. మహిళలకు రూ. 250, పురుషులకు రూ. 300 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికుల శ్రమను పెట్టుబడిదారులు దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కార్మికుల కష్టార్జితం భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో జమ అవుతున్నప్పటికీ.. నేటికీ వారి సంక్షేమం కోసం ఒక రూపాయి ఖర్చుపెట్టడం లేదు..దాంతో వారి బతు కులు కాంట్రాక్టర్లు,యజమాన్యాల చేతు ల్లో నలిగిపోతున్నాయి.నాలుగు పైసలు సంపాదించు కుందామని వస్తే..మా బతుకులు అగమవు తున్నాయని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులది కష్టం.. యాజమాన్యాలది లాభం
కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న రియల్టర్లు వారి శ్రమను పెట్టుబడిగా పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ వేతనంతో ఎక్కువ పని గంటలు పని చేయిస్తున్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న దినసరి వేతనం సుమారు రూ. 600 ఇవ్వాలని కార్మిక చట్టాలు చెబుతున్నా రూ. 300 మాత్రమే ఇస్తూ 12గంటలు పనిచేయించుకుంటున్నారు. బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికుల బతుకులకు అగం చేస్తున్నప్పటికీ.. కార్మిక శాఖ అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కార్మిక శాఖ అధికారులు స్పందించి కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని, వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలి
నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో వలస కార్మికులే ఎక్కువ. వారి జీవన స్థితిగతులు దయనీయంగా ఉన్నాయి. వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం చోరవ చూపాలి. కార్మికుల శ్రమను దోచుకుంటున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. కార్మిక శాఖ పర్యవేక్షణ కొరవడటంతో నిర్మాణ రంగంలో యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వం నిర్మాణ రంగంలో కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టి.. కనీస వేతనం.. పని ప్రదేశాల్లో మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలి.
- చంద్రమోహన్, సీఐటీయూ
రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి