Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందనీ, దాని పరిరక్షణ కోసం లౌకిక, అభ్యుదయవాదులంతా ఏకం కావాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌మిశ్రా అన్నారు. కులం, మతం, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చీలిక తెస్తూ ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రలు కొనసాగుతున్నాయనీ, అలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నదనీ, ఈ ప్రమాదాన్ని సామాన్య ప్రజలు గుర్తించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ వర్కింగ్ ఉమెన్ కన్వెన్షన్ శనివారంనాడిక్కడి సుగుణాకర్‌రావు భవన్లో జరిగింది. దీనికి శ్రీకాంత్ మిశ్రా ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఎల్ఐసీ ఐపీఓ అతిపెద్ద కుంభకోణమని వివరించారు. రూ.53 వేల కోట్లు రావల్సి ఉండగా, షేర్ విలువను తగ్గించి రూ.21వేల కోట్లకు అమ్మేశారని చెప్పారు. ఎల్ఐసీలో కేవలం 3 శాతం వాటా అమ్మకాన్నే ఇంత కారుచౌకగా అమ్మేస్తే, పూర్తి సంస్థను ఇక ఏం చేస్తారో అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివెనుక రాజకీయ ప్రమేయం ఉన్నదనీ, కావాలనే ప్రభుత్వ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇన్సూరెన్స్ రంగంలో ఇప్పటికే విదేశీ కంపెనీల గుత్తాధిపత్యం, అజమాయిషీ కొనసాగుతున్నాయనీ, ప్రభుత్వ రంగ సంస్థల్ని మరింత నిర్వీర్యం చేస్తే కార్పొరేట్ల ఆగడాలకు అడ్డూ అదుపు ఉండబోదని హెచ్చరించారు. ఇన్సూరెన్స్ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదనీ, వాటి సాధన కోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) సికింద్రాబాద్ డివిజన్ కన్వీనర్ ఏ రాధారాణి మహిళా ఉద్యోగుల సబ్‌కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టి, చర్చించారు. తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పి సుజాత, సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్ఎన్ శ్రీనివాస్, రఘు, జోన్ జాయింట్ సెక్రటరీ తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.