Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో నిందితుల అరెస్ట్
- పరారీలో ఇద్దరు
నవతెలంగాణ- సిటీబ్యూరో/ ధూల్‌పేట్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నీరజ్ కులదురహంకార హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌లో బేగంబజార్ కోల్సవాడికి చెందిన నీరజ్ పన్వార్ అలియాస్ బంటీ(21)ని కిరాతకంగా హత్య చేసిన నిందితులను 24 గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఆరుగురిలో నలుగురిని అరెస్టు చేశారు. శనివారం వెస్టుజోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు వివరాలు తెలిపారు.బేగంబజార్‌కు కోల్సవాడికి చెందిన నీరజ్ పన్వార్( 21) అదే ప్రాంతానికి చెందిన సంజనాను ప్రేమించాడు. పెండ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఏప్రిల్ 13, 2021లో శంషీర్‌గంజ్‌లోని సాయిబాబా దేవాలయంలో పెండ్లి చేసుకున్నారు. శంషీర్‌గంజ్ ప్రాంతంలోనే నివాసమున్నారు. కొద్ది రోజుల కిందట కోల్సవాడికు మకాం మార్చారు. ఇదిలావుండగా నీరజ్‌పై కక్షపెంచుకున్న భార్య కుటుంబసభ్యులు అతన్ని హత్యచేయాలని అదునుకోసం ఎదురు చూశారు. నీరజ్ నివాసముంటున్న సమీపంలోనే సంజనా పుట్టింటివారు, బంధువులు ఉంటున్నారు. నీరజ్ కదలికలపై ఆరా తీశారు. సంజన సోదరులు, వారి స్నేహితులు అభినందన్ యాదవ్, కె.విజయ్ యాదవ్, కె.సంజయ్ యాదవ్, బి.రోహిత్ యాద్, మహేష్ అహీర్ యాదవ్‌తోపాటు మరో మైనర్ ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. శుక్రవారం రాత్రి 7:30గంటల సమయంలో నీరజ్ తన తాతతో కలిసి బంధువుల ఇంటికెళ్లి వస్తున్నాడని తెలుసుకుని ఆరుగురు నిందితులు రెండు ద్విచక్రవాహనాలపై వెంబడించారు. నీరజ్ చేపలమార్కెట్ వద్దకు రాగానే అడ్డుకున్నారు. రాడ్లు, కత్తులతో దాడిచేయగా నీరజ్ తాత కిందపడిపోయాడు. నీరజ్ సమీపంలోని దుకాణంలోకి పరుగులు తీశాడు. అయినా దుండగులు వెంబడించి కిరాతకంగా హత్యచేశారు. ఆ వెంటనే కర్ణాటకలోని గుర్మిట్కల్ ప్రాంతానికి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న షాహీనాథ్గంజ్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపారు. 24గంటల్లో నలుగురి నిందితులను అరెస్టు చేయడంతో పోలీసులను, టాస్క్ఫోర్సు బృందాలను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో 7 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరారీలోవున్న కె.విజరు యాదవ్, బి.రోహిత్ యాదవ్ కోసం గాలిస్తున్నారు.
భారీ పోలీస్ బందోబస్తు
నీరజ్ హత్యకు నిరసనగా బేగంబజార్, షాహీనాథ్ గంజ్ తదితర ప్రాంతాల్లో వ్యాపారులు శనివారం బంద్ పాటించడం, నిరసనలకు దిగడంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.