Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనేక అంశాలపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి
- లోతైన చర్చ జరగడం అవసరం
- పరీక్ష ద్వారానే పీహెచ్డీ ప్రవేశాలు
- ఆర్ట్స్ కాలేజీ జ్ఞానానికి ప్రతీక
- రాజకీయ నాయకులకు అనుమతి లేదు : ఓయూ వీసీ రవీందర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉన్నది. అయినా నూతన విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించలేదు. కానీ ఎన్ఈపీని అమలు చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నది. యూజీసీ చైర్మెన్‌తో భేటీ అయినపుడు ఓయూ నుంచి కొన్ని ప్రతిపాదలు చెప్పాం. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. రాష్ట్రాలపై ఎన్ఈపీని రుద్దడం ఇబ్బందికరం. క్షేత్రస్థాయిలో దాని అమలుకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదు. ఎన్ఈపీలో అనేక అంశాలపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. దానిపై లోతుగా చర్చించాల్సిన అవసరముంది. వీసీల సమావేశంలోనూ దానిపై చర్చించాం. యూజీసీ ఇస్తున్న మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్తున్నాం. డిగ్రీలో క్లస్టర్ విధానం అమలు అందులో భాగమే. అకడమిక్ బ్య్రాంక్ ఆఫ్ కెడిట్స్పై అధ్యయనం చేస్తున్నాం. ఆ నివేదిక వచ్చాక అమలు చేస్తాం.'అని ఓయూ వీసీ డి రవీందర్ చెప్పారు. వీసీగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్ష ద్వారానే పీహెచ్డీ ప్రవేశాలు చేపడతామని స్పష్టం చేశారు. 2017కు ముందు పీహెచ్‌డీలో చేరిన వారు పత్రాలు సమర్పించకపోతే వాటిని రద్దు చేశామన్నారు. 2018 తర్వాత చేరిన వారు పత్రాలను 2023, జూన్ నాటికి సమర్పించాలని కోరారు. లేదంటే వారి పీహెచ్డీ ప్రవేశాలు రద్దవుతాయని చెప్పారు. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 21 పాయింట్లతో ఒక ఎజెండాను రూపొందించుకుని ప్రయాణాన్ని ప్రారంభించామని వివరించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాల బోధన, పరిశోధనల్లో వేగం, మౌళిక వసతుల అభివృద్ధి, కొంగొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులను మళ్లించటమే ప్రధాన లక్ష్యంగా వర్సిటీ పనిచేస్తున్నదని చెప్పారు. విశ్వవిద్యాలయంలో ప్రతిసంఘటన ఆలోచనల పండుగగా మారే సంస్కృతి వైపు పయనిస్తున్నామని వివరించారు. వర్సిటీ గత వైభవాన్ని తిరిగి పొందేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. ఆధునిక సమాజానికి అనుగుణంగా ఓయూలో సంస్కరణలు చేపడుతున్నామని అన్నారు. వర్సిటీలో విద్యార్థులకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించటంతోపాటు అకడమిక్ విభాగాలను పటిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆర్ట్స్ కాలేజీ జ్ఞానానికి ప్రతీక అని అన్నారు. అయితే అక్కడ ఉద్యమాలు, ఆందోళనలు చేయడం, పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, పోస్టర్లు, బ్యానర్లు కట్టడం సరైంది కాదన్నారు. విద్యార్థి సంఘాల నాయకులతో పలుమార్లు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చామనీ, స్టూడెంట్ కౌన్సిళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తే తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే స్టూడెంట్ కౌన్సిళ్లకు విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. ఓయూలోకి రాజకీయ నాయకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాహుల్‌గాంధీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తమ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. ఓయూలో ఏదైనా విభాగం సమకాలీన అంశంపై ఆహ్వానిస్తే రాజకీయ నాయకులకు అనుమతి ఇస్తామని చెప్పారు. విద్యార్థులుగా చేరండి... సివిల్ సర్వెంట్లుగా వెళ్లండి అనే నినాదంతో ముందుకెళ్తున్నామని వివరించారు. 15, 20 రోజుల్లో సివిల్ సర్వీసెస్ అకాడమిని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2 కోచింగ్ ప్రారంభమైందని వివరించారు. ఏడాది కాలంలో ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సెంటర్ ఫర్ ఇండోపసిఫిక్ స్టడీస్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఓయూ షీ సెంటర్‌ను ఈసీ ఆమోదం తీసుకుని ప్రారంభిస్తామని అన్నారు. శతాబ్ది ఉత్సవాల వేడుకల జ్ఞాపకంగా పైలాన్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. సంస్కరణ, పనితీరు మెరుగుకావడం, రూపాంతరం చెందడం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్, ప్రొఫెసర్లు మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.