Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే తీవ్ర ఇబ్బందులు
- రాష్ట్రాలకు ఏ మాత్రం విలువనివ్వని కేంద్రం
- ఆర్థికాంశాల్లో రాష్ట్రాలను పక్కన పెడుతున్న మోడీ సర్కార్
- అధికారాలన్నీ దాని చేతుల్లోనే
- ఇలాంటి చర్యలతో సమాఖ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం
- నవతెలంగాణ ఇంటర్వ్యూలో కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారాలను మరో ఐదేండ్లపాటు పొడిగించాలని కేరళ ఆర్థికశాఖ మంత్రి కేఎన్ బాలగోపాల్ డిమాండ్ చేశారు. లేదంటే ఆర్థికంగా రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇతర రాష్ట్రాలను కలుపుకుని పోవటం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. మరోవైపు నిధులు, గ్రాంట్లు, సహాయాలు తదితరాంశాల్లో పలు రాష్ట్రాల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్న కేంద్రం...పంచాయతీలకు నేరుగా తానే నిధులను విడుదల చేయటం ద్వారా రాష్ట్రాలను పక్కనపెడుతున్నద(బైపాస్)ని తెలిపారు. ఇది వాటి హక్కులను హరించటమేగాక సహకార సమాఖ్య వ్యవస్థ సూత్రాలను ఉల్లంఘించటమే అవుతుందని విమర్శించారు. కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా స్మారకోపన్యాసం ఇవ్వటానికి ఇటీవల హైదరాబాద్‌కు విచ్చేసిన బాలగోపాల్... నవతెలంగాణ ప్రతినిధి బి.వి.యన్.పద్మరాజుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జీఎస్టీ పరిహారాలు, ఆర్థికాంశాల్లో కేంద్రం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న తీరు, పెట్రో ఉత్పత్తుల ధరలు, వాటిని తగ్గించాలంటూ ప్రధాని మోడీ రాష్ట్రాలను కోరటం తదితరాంశాలపై ఆయన ఈ సందర్భంగా స్పందించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...
జీఎస్టీని ప్రవేశపెట్టి ఐదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పరిహారాలు ఈ యేడాది (జూన్‌తో) ఆగిపోనున్నాయి. ఫలితంగా తలెత్తే నిధుల అంతరాన్ని రాష్ట్రాలు భరించగలవంటారా..?
వాస్తవానికి జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడే ఇది రాష్ట్రాలకు తీవ్ర నష్టమని సీపీఐ (ఎం), ఇతర వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీన్ని ప్రవేశపెట్టినప్పుడు జీఎస్టీ వల్ల నష్టపోయే ఆదాయాన్ని ఐదేండ్లపాటు రాష్ట్రాలకు పరిహారం రూపంలో ఇస్తామంటూ కేంద్రం ప్రకటించింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరులు మూడే మూడు. అవి పెట్రోల్, డీజిల్, లిక్కర్్. వీటిపై వేసే పన్నుల ద్వారానే రాష్ట్రాలకు ఆదాయమొస్తుంది. కానీ కేంద్రానికి అనేక ఆదాయ మార్గాలు, వనరులూ ఉంటాయి. జీఎస్టీకి ముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ దగ్గర ఉత్పత్తయ్యే ప్రత్యేకమైన వస్తువులపై పన్నులు విధించటం ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని గడించేవి. అయితే ఒకే దేశం-ఒకే పన్ను పేరిట ఏకీకృత పన్నుల విధానాన్ని తీసుకురావటం వల్ల ఆ అవకాశాన్ని అవి కోల్పోయాయి. ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ రకంగా కేరళ ప్రభుత్వం ప్రతీయేటా రూ.10 వేల కోట్లను కోల్పోతున్నది. మాకు సంబంధించి ఇది చాలా పెద్ద మొత్తం. ఇదే పరిస్థితి తెలంగాణ, ఆంధ్రా ఇలా అన్ని రాష్ట్రాలకూ ఉంది. మరోవైపు జీఎస్టీ ప్రవేశపెట్టి ఐదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జూన్ తర్వాత... రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాలను కేంద్రం ఆపేయనుంది. అప్పుడు పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది. దాన్ని ఊహించుకోవటం కూడా కష్టమే. వాస్తవానికి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించిన ప్రతీసారి ఈ సమస్యలన్నింటినీ ఆ కౌన్సిల్ దృష్టికి తీసుకెళుతున్నాం. కానీ పట్టించుకునే నాథుడే లేడు. నిజానికి ఆ కౌన్సిల్లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులందరూ సభ్యులుగా ఉంటారు. కానీ చివరకు కేంద్రం చెప్పేదే అక్కడ చెల్లుబాటవుతుంది. దాని ఆదేశాలే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించి రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాలను మరో ఐదేండ్ల పాటు పొడిగించాలని కోరుతున్నాం. కేంద్రం ఏం చేస్తుందో వేచి చూడాలి. మేం మాత్రం ఈ అంశంలో ఇతర రాష్ట్రాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం.
కేంద్ర పన్నుల్లో 42 శాతాన్ని తమకు పంచాలంటూ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఆ డిమాండ్‌ను పట్టించుకోవటం లేదు. ఈ నేపథ్యంలో ఆ వాటా రాకుండా రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలటం సాధ్యమేనా...?
ఇక్కడ రెండు విషయాలను మనం గమనించాలి. సెంట్రల్ ట్యాక్సుల్లో రాష్ట్రాలకు 42 శాతం (డివిజబుల్ పూల్) ఇవ్వాల్సి ఉంటుంది. అదే జీఎస్టీ అయితే 50 శాతం రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. మరోవైపు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కల్పన రంగాలకు సంబంధించి రాష్ట్రాలు... తమకొచ్చే ఆదాయంలో దాదాపు 64 శాతాన్ని ఖర్చు చేస్తున్నాయి. ఆదాయం మాత్రం కేంద్రానికే 65 శాతం వెళుతున్నది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఒక వంతు ఉంటే.. ఖర్చు మాత్రం రెండొంతులుగా ఉంటుంది. అందువల్ల అవి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. రాష్ట్రాలు డివిజబుల్ పూల్ (కేంద్ర పన్నులు) నుంచి 42 శాతాన్ని అడిగితే... అంతకుమించి 50 శాతం దాకా ఇవ్వటం దాని బాధ్యత. కానీ వీటిలో ఏ ఒక్కదాన్నీ కేంద్రం పట్టించుకోవటం లేదు.
రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే కేంద్రం... స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలకు నిధులను నేరుగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. అదే నిర్ణయాన్ని అమలు చేస్తున్నది. దీన్ని ఎలా చూడాలి...?
గతంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉండేవి. వాటికి పూర్తిగా నిధులను కేంద్రమే భరించేది. క్రమక్రమంగా రాష్ట్రాలు 40 శాతం, కేంద్రం 60 శాతం భరిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో కేంద్రం తన వాటాను తగ్గిసూ, రాష్ట్రాల వాటాను పెంచుతూ పోతున్నది. ఈ వాటాల్లో రకరకాల మార్పులు, చేర్పులూ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రాల్లో అమల్జేస్తున్న కేంద్ర పథకాల సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో కేరళలో 'స్టేట్ హెల్త్ అథారిటీ...' కింద మేం 42 లక్షల కుటుంబాలకు అంటే జనాభాలో సగం రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం భరించేది చాలా నామమాత్రం. దీనికయ్యే ఖర్చు రూ.750 కోట్లలో కేవలం రూ.80 కోట్లే కేంద్రం భరిస్తుంది. మిగతావి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఇలాగే గృహ నిర్మాణం, ఇతర రంగాల్లో కూడా కేంద్ర సాయాలు, ఖర్చు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇదే కోవలో గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులివ్వటం ద్వారా అది రాష్ట్ర ప్రభుత్వాలను బైపాస్ చేస్తున్నదన్నమాట. ఒక రకంగా రాష్ట్రాలకున్న ఆర్థికాధికారాల్లో ఒక్కోదాన్ని కేంద్రం లాగేసుకుంటున్నది. భారతదేశంలాంటి సహకార సమాఖ్య వ్యవస్థలో ఇలాంటి విధానాలు, చర్యలు సరికాదు, సమర్థనీయం కాదు. భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులున్న క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం గౌరవం, విలువనివ్వటం ద్వారా వాటికి మద్దతుగా నిలవాలి. రాజ్యాగం కూడా ఇదే చెబుతున్నది. కానీ కేంద్రం మాత్రం రాజ్యాంగంలోని ఇలాంటి మౌలిక సూత్రాలను కూడా యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నది. కొన్ని కొన్ని షార్ట్కట్ల ద్వారా ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నది.
పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలు విధించిన సుంకాలను తగ్గించాలంటూ ప్రధాని మోడీ ఇటీవల కోరారు. దీనిపై మీ అభిప్రాయం...
ఆయన వ్యాఖ్యలపై మొదట స్పందించింది కేరళ ప్రభుత్వమే. వాస్తవానికి రాష్ట్రాలకు కేవలం పెట్రోల్, డీజిల్, లిక్కర్ మీదనే పన్నులేసే అధికారముంది. ఇక వేరే దేనీ మీద వాటికి ఆ హక్కు లేదు. గ్యాస్ మీద కూడా కేంద్రమే సుంకాలు, పన్నులు విధిస్తుంది. దీంతోపాటు మిగతా అన్నింటి మీదా పన్నులేసే అధికారం దానికే ఉంటుంది. ఈ క్రమంలో అన్ని రేట్లూ కేంద్రమే పెంచుకుంటూ పోతున్నది. ఇదే విధంగా గ్యాస్ రెట్లనూ పెంచుకుంటూ పోతున్నారు. పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ రాష్ట్రాలను కోరుతున్న ప్రధాని... గ్యాస్ ధరలను కేంద్రం ఎందుకు పెంచుతున్నదో మాత్రం చెప్పటం లేదు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.1,030 (తాజాగా పీఎం ఉజ్వల్ యోజన పథకం వర్తించే వారికి రూ.200 తగ్గించారు. మిగతా వారందరికీ ఇదే ధర) ఉంది. గ్యాస్ మీద 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుంది. ఇందులో 2.5 శాతం (రూ.25) కేంద్రానికి, 2.5 (రూ.25) శాతం రాష్ట్రాలకు వెళుతున్నది. వాస్తవానికి ఒక సిలిండర్ ధర రూ.700 కంటే తక్కువగానే ఉంటుంది. మిగతా ధరను కేంద్రం పెంచింది. దాన్ని ఎందుకు పెంచారో చెప్పటం లేదు. అది కంపెనీలకు, కేంద్రానికి వెళుతుంది. కానీ పెట్రోల్, డీజిల్, లిక్కర్్పై పన్నులు వేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. అయితే కేరళలో మేం (పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం) గత ఆరేండ్ల నుంచి వాటిపై ఒక్కసారి కూడా పన్నుల శాతాన్ని పెంచలేదు. అందువల్ల అసలు పన్నులే పెంచనప్పుడు ప్రధాని మోడీ మేము, మాతోపాటు పన్నులు పెంచని ఇతర రాష్ట్రాలను వాటిని తగ్గించాలంటూ ఎలా అడుగుతారు..? ఇక్కడే కేంద్రం ప్రజలను గందరగోళ పరుస్తున్నది. విచిత్రమేమంటే...అదే పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గత ఆరేండ్లలో 14 సార్లు పన్నులను పెంచి, ఐదు సార్లు (తాజాగా తగ్గించిన దాంతో కలుపుకుని) మాత్రమే తగ్గించింది. మరోవైపు ఆర్టికల్ 271లోని ప్రత్యేక నిబంధన ప్రకారం... కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేంద్రం విధించే లెవీ, సెస్, సర్ఛార్జీలు అనేవి రాష్ట్రాల పన్నుల కంటే ఎక్కువగా ఉండొచ్చు. దేశంలో అత్యయిక స్థితి, యుద్ధాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కేంద్రానికి ఈ విధంగా పెంచుకునే అధికారం ఉంది. సాధారణ పరిస్థితుల్లో ఈ అధికారాన్ని వాడుకోకూడదు. కానీ ఇప్పుడు కేంద్రం...దాన్ని నిరంతరం వినియోగించుకుంటున్నది. ఈ పేరుతో రాష్ట్రాలు విధించే పన్నుల కంటే ఎక్కువ మొత్తాన్ని రాబడుతున్నది. ఈ రకంగా యేటా రూ.4 లక్షల కోట్లను ఆర్జిస్తున్నది. దీంట్లో ఇంకో రహస్యం ఉంది. ప్రత్యేక సెస్, సర్‌ఛార్జీల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలంటూ రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదు. దీన్ని ఉపయోగించుకుని కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. ఇది రాష్ట్రాల ఆర్థిక హక్కులను హరించటం, సహకార సమాఖ్య వ్యవస్థను ఉల్లంఘించటమే అవుతుంది.
కోవిడ్‌ను నియంత్రించటంలో కేరళ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఇది ఎలా సాధ్యమైంది...?
మేం మొదటి నుంచి విద్య, వైద్య రంగాలకు తగు ప్రాధాన్యతనిచ్చి ఆ మేరకు బడ్జెట్లో చాలినన్ని నిధులు కేటాయిస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి 13,400 దాకా ఉన్నాయి. వాటిలో పని చేసే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్నది. మా దగ్గర ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ బలంగా ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ వ్యవస్థను ఉపయోగించుకుని ప్రజలను కాపాడగలిగాం.