Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లకార్డులతో సీసీఎల్ఏ వైపు దూసుకెళ్లే యత్నం
- వాహనాల్లో కుక్కి బలవంతంగా పోలీస్స్టేషన్లకు తరలింపు
- జిల్లాల్లో నిర్బంధాలు... నగరశివార్లలో అడ్డగింతలు
- మహిళకు రోడ్డుప్రమాదం.. విరిగిన చేయి
- పోలీసుల పర్యవేక్షణ నడుమ సీసీఎల్ఏ కార్యదర్శికి వీఆర్ఏల జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలు గొంతెమ్మ కోరికలేం కోరలేదు.. 'సీఎం కేసీఆర్ సార్ పేస్కేలు ఇస్తనన్నాడు.. వారసత్వ ఉద్యోగాలిస్తనన్నాడు.. వాటిని వెంటనే అమల్లోకి తేవాలని వేడుకుంటాం.. సీసీఎల్ఏ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తాం' అని అనుమతి అడిగితే ప్రభుత్వం తిరస్కరించింది. హక్కులడిగితే సహించబోమంటూ పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించింది. శనివారం తలపెట్టిన వీఆర్ఏల చలో సీసీఎల్ఏ ముట్టడిని అడుగడుగునా అడ్డుకున్నది. హైదరాబాద్‌లో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వికారాబాద్ జిల్లా కొట్టాలగూడకు చెందిన మహిళా వీఆర్ఏ రోడ్డు ప్రమాదానికి గురైంది. అమె చేయి విరిగింది. తలకు గాయమైంది. సీసీఎల్ఏ ముట్టడి ప్రకటన నాటి నుంచే వీఆర్ఏలను బెదిరింపులకు దిగింది. రెండ్రోజుల ముందు నుంచే 23 వేల మంది వీఆర్ఏల ప్రతికదలికపైనా నిఘా పెట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచే అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించింది. ఎలాగో అలాగా తప్పించుకుని పట్నం బాట పట్టినవారిని నగరశివార్లలోనే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఎక్కడికక్కడ అడ్డగించింది. అయినా, ఏదోరకంగా వచ్చిన వీఆర్ఏలను సీసీఎల్ఏ కార్యాలయానికి ఎటూ కిలోమీటర్ దూరంలో డేగకన్ను నిఘా పెట్టి ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తూ.. కనిపించినోళ్లను కనిపించినట్టుగా డీసీఎమ్లలో కుక్కి వందలాది మందిని పోలీస్స్టేషన్లకు తరలించింది. ముసలోళ్లం మమ్ముల్ని వదలండని వేడుకున్నా కనికరించలేదు. కొందరికైతే 'ఆ ఆఫీసు ఇక్కడలేదు.. మస్తు దూరం ఉంది.. ఎండల ఏడ్కిపోతరు? ఈ చెట్టు కిందనే కూర్చోండి' అంటూ సీసీఎల్ఏ కార్యాలయం సమీపంలోనే ఊర్ల నుంచి వచ్చిన వీఆర్ఏలను కూర్చోబెట్టిన పరిస్థితి కనిపించింది. అతికష్టం మీద ఆ కార్యాలయం సమీపానికి చేరుకున్న వీఆర్ఏ జేఏసీ నేతలను పోలీసులు తమ అదుపులోకి తీసుకునే క్రమంలో వాగ్వివాదం చోటుచేసుకున్నది. బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. 'మేం గొడవ చేయడానికి రాలేదు...ఆఫీసుల మీద దాడి చేయడానికి రాలేదు..శాంతియుతంగా ధర్నా చేసి వినతిపత్రం ఇస్తామని చెబుతున్నాం..దీనికి కూడా అనుమతి ఇవ్వరా? ఇదేం ధోరణి? ఇదెక్కడి న్యాయం? ఇంత నిరకుంశమా?' అంటూ జేఏసీ నేతలు పోలీసు ఉన్నతాధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో జేఏసీ ప్రతినిధులు ఐదారుగురు మాత్రమే వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం ఇస్తామని చెప్పి...పదుల సంఖ్యలో పోలీసుల బందోబస్తు మధ్య వారిని సీసీఎల్ఏ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. జేఏసీ ప్రతినిధులు సీసీఎల్ఏ కార్యదర్శి హైమావతికి వినతిపత్రం ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు.
అనంతరం వీఆర్ఏ జేఏసీ చైర్మెన్ జి.రాజయ్య, కో-చైర్మెన్ రమేశ్ బహదూర్, ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా, కన్వీనర్ సాయన్న, కో-కన్వీనర్లు వంగూరు రాములు, ఎస్కే రఫీ, వెంకటేశ్‌యాదవ్, గోవింద్, తదితరులు మాట్లాడుతూ.. 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా 23 వేల మంది వీఆర్ఏలందరికీ పేస్కేల్ ఇస్తామనీ, వారసులకు తండ్రుల స్థానంలో ఉద్యోగాలిస్తామని నిండు శాసనసభలో స్వయానా సీఎం కేసీఆర్ హామీనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
20 నెలలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా సీఎం హామీ నెరవేరలేదని వాపోయారు. పేస్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, అర్హత కల్గిన వారికి పదోన్నతులు కల్పించకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో బండెడు చాకిరీ చేస్తున్న వీఆర్ఏలపై సర్కారు వైఖరి సరిగాదని తెలిపారు. నూటికి 90 శాతం మంది పైగా సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన దళితులే ఉన్నారన్నారు. వచ్చే జీతం చాలక వీఆర్ఏలు కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నారనీ, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఆర్ఏలకు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పే-స్కేల్ జీఓ విడుదల చేయాలనీ, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.