Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దిశ లైంగికదాడి, హత్య ఘటనలో చటాన్‌పల్లి ఎన్కౌంటర్ బూటకమని, కట్టుకథలా ఉందంటూ జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని కమిషన్ నిర్ధారణలపై సుప్రీంకోర్టు సూచనలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పది మంది పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2019లో హైదరాబాద్ నగర శివారులో వెటర్నరీ డాక్టరు దిశపై లైంగికదాడి, హత్య, నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని కమిషన్‌ను నియమించిందని గుర్తుచేశారు. ఆ కమిషన్ విచారణ జరిపి 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించిందని వివరించారు. ఈ నివేదికలో ఆత్మరక్షణకే కాల్పులు జరిపామనే పోలీసుల వాదనకు ఆధారాల్లేవంటూ ప్రకటించిందని తెలిపారు. వారు చెప్పిన వాదనలలో పొంతనలేదని అభిప్రాయపడిందని పేర్కొన్నారు. హత్యాచార నిందితులను చంపాలనే కోణంలోనే ఎన్కౌంటర్ జరిగిందని స్పష్టం చేసిందని వివరించారు. నిందితుల గుర్తింపు, అరెస్టుల సందర్భంలో చట్టబద్ద హక్కుల ఉల్లంఘనలు జరిగాయనీ, కొన్ని కోణాల్లో న్యాయ నిబంధనలను తుంగలో తొక్కారనీ, విస్మరించారని నివేదికలో తేల్చిచెప్పిందని తెలిపారు. ప్రజలు ఒత్తిడి చేస్తున్నారనే పేరుతో అనుమానితులను ఎన్కౌంటర్ చేయడం, చట్టప్రకారం వ్యవహరించకపోవడం, చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని విమర్శించారు. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను అమలుచేస్తూ, చట్టప్రకారమే పోలీసు వ్యవస్ధ వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.