Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయశంకర్ పేరు చెప్పినందుకు 'కడియం', 'చారి' ఉద్యోగాలు ఊడినరు
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్కంపేట దత్తత : 'రైతు రచ్చబండ'లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణకు, అక్కంపేటకు ద్రోహం చేసిన సీఎం కేసీఆర్‌ను ఇకపై దంచుడే.. దించుడేనని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో శనివారం 'రైతు రచ్చబండ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు రైతులు, గ్రామస్తులతో మాట్లాడించారు. వారంతా గ్రామసమస్యలను ఏకరువు పెట్టారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి దశ, దిశానిర్దేశం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట గ్రామం నేటికీ రెవెన్యూ గ్రామం కాకపోవడం దారుణమన్నారు. 200-300 ఓట్లున్న తండాలను గ్రామపంచాయతీలు చేసిన కేసీఆర్ 5 వేల జనాభా వుండి, 2,800 మంది ఓటర్లున్న అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయకపోవడం విచారకరమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు చెప్పుకొని, ఆయన ఫొటోకు దండేసి దండం పెట్టే సీఎం కేసీఆర్ ఈ 8 ఏండ్లలో అక్కంపేట గ్రామానికి ఏం చేశారని ప్రశ్నించారు. జయశంకర్ సార్ విగ్రహం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనీ, కొండా మురళి, కొండా సురేఖ దంపతులు పెట్టారని యువకులు చెప్పారని అన్నారు. అక్కంపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని, మిషన్ భగీరథ లేవని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, ఆరోగ్య కేంద్రం, పశువుల దవాఖాన పెట్టలేదని, జూనియర్ కాలేజీని కూడా నిర్మించలేదని వివరించారు. అక్కంపేటకు ఏమీ చేయలేదనీ, ఇక్కడ దళిత వాడకు వెళితే చాలా దయనీయమైన పరిస్థితి వుందన్నారు.
అక్కంపేటలో జయశంకర్ సార్ విగ్రహం పెడుతామని, ఆయన పేర స్మృతివనం నిర్మిస్తామని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారని గుర్తు చేశారు. జయశంకర్ పేరు గుర్తు చేసినందుకు వాళ్లిద్దరి ఉద్యోగాలు ఊడపీకిన చరిత్ర సీఎం కేసీఆర్‌దన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు. గ్రామానికి ఏఐసీసీి ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీని తీసుకొస్తానన్నారు. గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనాన్ని నిర్మిస్తామని, రెవెన్యూ గ్రామంగా మారుస్తామని, ఆరోగ్య కేంద్రం, పశువుల వైద్యశాల, జూనియర్ కాలేజీ, ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని దోచుకుతింటున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమన్నారు.
'పల్లా' పళ్లూడగొట్టాలే..
2018-2022 వరకు 74 వేల మంది రైతులకు రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇచ్చినట్టు సీఎం కేసీఆర్ పుట్టినరోజు నాడు ప్రకటించారని నేను గుర్తు చేస్తే.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాదు.. కాదు.. 84 వేల మంది రైతులకు రైతుబీమా కింద రూ.5 లక్షల చెక్కులు ఇచ్చామని ప్రకటించారన్నారు. ఇంత సిగ్గు లేకుండా చెబుతున్న 'పల్లా' పల్లూడకొట్టాలన్నారు.
రైతు పోరాటానికి మద్దతు
ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి రేవంత్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. వరంగల్ మండలం కొత్తపేట గ్రామంలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు కోల్పోతున్న రైతులతో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సిలువేరు జాని ఇంట్లో భోజనం చేశారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రైతు రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు వేంనరేందర్‌రెడ్డి, వరంగల్, హన్మకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్, గండ్ర సత్యనారాయణరావు, ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.