Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ తరహా విద్యావిధానమైతే ఆమోదిస్తా..
- రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలి
- ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన విద్యావిధానాన్ని కేంద్రం ఏకపక్షంగా తెచ్చిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. శనివారం ఢిల్లీలోని మోడీబాగ్‌లో సర్వోదయ స్కూల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి ఆయన సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి తాము అనుసరిస్తున్న కాన్సెప్ట్‌ను, ప్రతి ఏడాది ఖర్చు పెడుతున్న బడ్జెట్ తదితరాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. 30 నిమిషాలపాటు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కేసీఆర్ తిలకించారు. విద్యాభివృద్ధి కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, స్కూల్ కరిక్యులమ్‌ను అక్కడి అధికారులు చంద్రశేఖర్‌రావుకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ తరహా విద్యావిధానమైతే తాను ఆమోదిస్తానని స్పష్టం చేశారు. నూతన విద్యా విధానంపై కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో విద్యావిధానముందనీ, అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన బాగుందనీ, విద్యార్థులు ఉద్యోగాలిచ్చే వారిగా మారుతున్నారని అభినందించారు. తెలంగాణ అధికారులను, ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపించి రాష్ట్రంలో విద్యావిధానాన్ని మారుస్తామని ప్రకటించారు. ఏ రాష్ట్రమైనా ప్రజల కోసం మంచి పనులు చేస్తుంటే వాటిని తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఐదేండ్ల క్రితం ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ల గురించి తెలుసుకుని 350 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని చెప్పారు. మొహల్లా క్లినిక్‌లు బాగున్నాయనీ, ప్రతి రోజు 90 నుంచి 105 మంది వరకు రోగులను చూస్తున్నారని చెప్పారు.
కేసీఆర్‌కు విద్యావిధానంపై ఎంతో ఆసక్తి....కేజ్రీవాల్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు విద్యావిధానంపై ఎంతో ఆసక్తి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. ఢిల్లీ స్కూల్‌ను సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల గదులన్నీ పరిశీలించారనీ, ఒక్కో ప్రశ్న అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
ప్రముఖులతో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆర్థికవేత్తలు, రాజకీయ, మీడియా రంగ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఆయన దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికకుటుంబాలను కలిసి ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్‌కు చేరుకుని రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 కుటుంబాలను పరామర్శిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.మూడు లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయనతో పాటు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్సింగ్ కూడా పాల్గొననున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఆ తర్వాత 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్ కేసీఆర్‌తో ఢిల్లీ తుగ్లక్ రోడ్-23లోని కేసీఆర్ నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి వారి మధ్య ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తున్నది. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరంపై వారివురు చర్చించినట్టు తెలిసింది.
అనంతరం మీడియా ప్రతినిధులు సమావేసం వివరాలడిగితే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, అది చిన్న విషయమనీ, దేశ రాజకీయాల్లో సంచలనం జరగబోతున్నదని చెప్పారు. ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు.