Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిపై ఒత్తిడి తెస్తారు ... దేశద్రోహులంటూ ముద్రేస్తారు : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుల పక్షాన మాట్లాడుతూ... వారి సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులంటే కేంద్రానికి నచ్చదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారిపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొస్తారని తెలిపారు. ఈ క్రమంలో రైతు ఉద్యమ సమయంలో బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎవరెవరిపై ఎలాంటి ఆరోపణలు చేశారో అందరికీ తెలుసునని అన్నారు. రైతు నేతలను ఖలిస్థానీలు, దేశద్రోహులంటూ ముద్రేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పట్టువీడక ఉద్యమాన్ని కొనసాగించిన నాయకులందరికీ సలాం చేస్తున్నానని అన్నారు. ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలనుండే కాకుండా యావత్ భారతదేశం నుండి కూడా రైతు ఉద్యమం నడవాలని ఆయన ఆకాంక్షించారు. రైతులు పండించిన పంట విలువకు రాజ్యాంగపరమైన రక్షణ లభించేదాకా పోరాటం ఆపకూడదనీ, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఈ అంశానికి కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకి మనం మద్దతివ్వాలని అన్నారు. ఈ పరిస్థితిని సృష్టించగలిగినప్పుడు రైతు పండించిన పంటకు రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుందని సీఎం చెప్పారు.
వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్... ఆదివారం ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చండీగఢ్‌లోని ఠాగోర్ స్టేడియంలో అమరులైన రైతు, సైనికుల కుటుంబాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఈ రోజు ఢిల్లీలో మన తలపై కూర్చున్న ప్రభుత్వం (మోడీ సర్కార్) వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటోందని గుర్తు చేశారు. కాల్చుకున్న కరెంటుకు లెక్కలు వేయాలంటోందనీ, తద్వారా రక్తం పీల్చమంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం...మీటర్లు పెట్టబోమంటూ అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పిందని వివరించారు. ఏం చేసుకోవాలనుకుంటే అదే చేసుకోండంటూ తెగేసి చెప్పామని తెలిపారు. మరోవైపు మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటమనేది సంతోషకరమైన విషయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన సందర్భమని తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం కూడా ఇలాంటి సభలు జరుపుకోవాల్సిన అగత్యం మనకు పట్టటం దారుణమని అన్నారు. దేశం ఈ విధంగా ఎందుకు ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు, ప్రతీ విషయానికి సంబంధించి ఎంతో కృషి చేయాల్సి ఉందనీ, అసలు మూలాలను, కారణాలను తెలుసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఈ దుస్థితిపై ప్రజలు పోరాడాలి, అవసరమైతే మరణించాల్సి ఉంటుంది, త్యాగాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సమస్యలున్నాయనీ, కానీ మన దగ్గరున్న సమస్యలు మరేచోటా లేవని వివరించారు. రైతు ఉద్యమంలో అమరులైన వారిని మనం తిరిగి తీసుకురాలేమనీ, కానీ యావత్ ప్రపంచం వారితో ఉందనే విషయాన్ని గుర్తు చేసి, సానుభూతిని ప్రకటించాలని కోరారు. దేశం కోసం ప్రాణాలర్పించిన యోధులను కన్న గడ్డ పంజాబ్ అని ప్రశంసించారు. హరిత విప్లవాన్ని మొట్టమొదటగా సృష్టించటం ద్వారా దేశానికే అన్నం పెట్టిన గొప్ప రాష్ట్రమని చెప్పారు. గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన సంఘర్షణలో తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబుతోపాటు పంజాబ్ సైనికులు కూడా అమరులయ్యారని గుర్తు చేశారు. రైతు ఉద్యమ సమయంలో పంజాబ్‌కు వచ్చి అమరులైన వారి కుటుంబాలను ఆదుకుందామని భావించామని అన్నారు. అయితే అక్కడ ఎన్నికలు ఉండటం వల్ల నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపట్టకూడదనే ఉద్దేశంతో రాలేదని సీఎం వివరించారు.