Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఏర్పాటు
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ : కేజ్రీవాల్‌కు సీఎం కేసీఆర్ ప్రతిపాదన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయపార్టీలతో కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు కలిసి రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సూచించారు. రాబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ఫ్రంట్ నుంచే అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపాలని ప్రతిపాదించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో లంచ్మీటింగ్కు హాజరయ్యారు. ఢిల్లీ సివిల్‌లైన్ లోని కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలపాటు ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించినట్టు సమాచారం. దేశాభివద్ధికి కొత్త ఎజెండా రూపకల్పనపై చర్చించినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపైనా చర్చించారు. 2024 ఎన్నికల ఎజెండాగానే ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలతో కలుపుకుని ఒక వేదికను తయారు చేయాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడినట్టు సమాచారం. సీఎం కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఉన్నారు. భోజనానంతరం ముఖ్యమంత్రులు ఇరువురూ ప్రత్యేక విమానంలో పంజాబ్ రాజధాని చండీగఢ్‌కి వెళ్లారు. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వారికి స్వాగతం పలికారు. అనంతరం చండీఘడ్‌లోని ఠాగూర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముగ్గురు నేతలు హాజరయ్యారు. గల్వాన్ వ్యాలీలో చనిపోయిన జవాన్ల కుటుంబాలను, రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. జవాన్ల కుటుంబాలకు 10 లక్షలు, రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అయితే ఈ చర్చలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.