Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రాష్ట్రాల ఎన్నికల కోసమే ఈ హైరానా...
- పెట్రోల్‌పై రూ.11.29 పైసలు పెంచి..రూ.8 తగ్గింపు
- డీజిల్‌పై రూ.10.87 పైసలు పెంచి..రూ.7 తగ్గింపు
- ప్రయివేటు వ్యాపారులకంటే దారుణంగా మోడీ సర్కారు దోపిడీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''ప్రభుత్వం వ్యాపారం చేయదు. ప్రజాసంక్షేమాన్ని మాత్రమే చూస్తుంది'' ఈ ఏడాది ఫిబ్రవరి 9న పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇది. మరి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై కేంద్రప్రభుత్వం చేస్తున్నది ఏంటి? వ్యాపారం కాదా? దేశప్రజల్ని తొలుస్తున్న ప్రశ్న ఇది. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అదే ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ తమకు అన్నింటికన్నా దేశ ప్రజలే ముఖ్యం అని స్టేట్మెంట్ ఇచ్చారు. తగ్గించిన ధరలు అమల్లోకీ వచ్చాయి. ఇక బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ కేంద్ర సర్కారును, ప్రధాని మోడీని స్తుతిస్తూ 'న భూతో న భవిష్యత్' అన్నట్టు ప్రచారాన్ని మొదలు పెట్టింది. అసలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో దేశంలో లీటర్ పెట్రోల్ ధర అక్షరాలా రూ. 114.49 పైసలు. డీజిల్ ధర రూ.109.49 పైసలు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకంటే మూడు నెలల ముందు (నవంబర్‌లో) పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సుంకం (పన్ను పరిధిలోకి రాని ఆర్థికభారం-సెస్) తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీనితో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20 పైసలు, డీజిల్ లీటర్ ధర రూ.94.62 పైసలు అయ్యాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10వ తేదీ వెల్లడయ్యాయి. అప్పటి వరకు ఒక్క పైసా కూడా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై పెరగలేదు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే, కేంద్రం ఏప్రిల్ 6 నుంచి మళ్లీ పెట్రోబాదుడు షురూ చేసింది. ఇక అప్పటి నుంచి మే 21వ తేదీ వరకు (కేవలం 45 రోజుల్లో) లీటర్ పెట్రోల్‌పై రూ.11.29 పైసలు (ప్రస్తుత రేటు రూ.119.49 పైసలు), డీజిల్‌పై రూ.10.87 పైసలు (ప్రస్తుత ధర రూ.105.49 పైసలు) పెంచింది. ఇప్పుడు లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత లీటర్‌పై రూ.11.29 పైసలు పెంచి, రూ.8 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది (ఐనా ప్రజలపై భారం రూ.3.29 పైసలు). డీజిల్ రూ.10.87 పైసలు పెంచి రూ.6 తగ్గించింది (ఐనా భారం రూ.4.87 పైసలు). త్వరలో గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిని ప్రభావితం చేయాలంటే బీజేపీకి ఏదో ఒక ప్రచార ఆయుధం కావాలి. దేశంలో ఆ పార్టీ నేతలు ఎక్కడకు వెళ్లినా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లపై ప్రజలు నిలదీస్తున్నారు. దానికోసమే కేంద్రం ఈ 'తగ్గింపు' నాటకానికి తెరలేపింది. ఇప్పటికీ పెట్రో ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న పన్నులు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనంత స్థాయిలో ఉన్నాయి. ఇండ్లలో వాడే వంటగ్యాస్ ధర రూ.1,050 చేరింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2వేలను ఎప్పుడో దాటేసింది. చిరు వ్యాపారులు మొదలు హౌటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ఆ ధర భరించలేక మొత్తుకుంటున్నారు. తినుబండారాల రేట్లు భారీగా పెరిగాయి. జనంపై మోయలేని భారాలు వేసి, కేవలం ఎన్నికల్లో లబ్ది పొందటం కోసమే తగ్గింపు డ్రామాలు ఆడుతున్న కేంద్రప్రభుత్వం చేస్తున్నది వ్యాపారమా...లేక ప్రజా సంక్షేమమా? అనే ప్రశ్నను సామాన్యులు లేవనెత్తుతున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు అయ్యాక లీటర్ రూ.150 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని జనం వ్యాఖ్యానిస్తున్నారు!