Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వసతులు మృగ్యం
- ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క లైబ్రరీలోనూ కనీస పుస్తకాలు లేవు
- నోటిఫికేషన్లతో భారీగా పెరిగిన పాఠకులు
- ఆ స్థాయిలో సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం
- ఆందోళనలకు దిగుతున్న రుద్యోగులు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పుష్కరకాలం తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో గ్రంథాలయాలకు వచ్చే పాఠకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఉన్న ఒక్కో గ్రంథాలయానికి వందల్లో నిరుద్యోగులు వస్తున్నారు. కానీ ఎప్పుడో 'గ్రంథ'పాలన మరిచిన ప్రభుత్వం లైబ్రరీల్లో కనీస వసతులను విస్మరించింది. వాటి బాగోగులను పట్టించుకోకపోవడంతో మూడు, నాలుగు దశాబ్దాల కిందట నిర్మించిన గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయి. వేల సంఖ్యలో పుస్తకాలు ఉండాల్సిన చోట కనీస పుస్తకాలు కూడా కరువయ్యాయి. ప్రస్తుత పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లేకపోవడం, ఉన్న కొద్దిపాటి పుస్తకాలు పాఠకుల సంఖ్యకు అనుగుణంగా లేకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రోజుకు 700 మంది పాఠకులు వస్తుంటే.. వంద మందికి సరిపడా కూడా వసతులు, పోటీ పరీక్షల పుస్తకాలు లేకపోవడంతో ఇటీవల లైబ్రరీ ఎదుట ఆందోళన చేశారు.
పేరుకే జిల్లా గ్రంథాలయం..
వచ్చేనెలలో వరుసగా పోటీ పరీక్షలు నిర్వహించనుండగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకునేందుకు భారీగా యువతీ, యువకులు వస్తున్నారు. ఒక్కో అభ్యర్థి వ్యయ ప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి ఖమ్మం వచ్చి అద్దె గదులు, హాస్టళ్లలో ఉంటూ గ్రంథాలయాల్లో చదువుకునేందుకు వస్తున్నారు. అయితే, సబ్జెక్టుకు సంబంధించిన తాజా పుస్తకాలు అరకొరగానే ఉండటం, కనీసం ఏడాదికి మించిన పాత పత్రికలు కూడా లభించకపోవడం గమనార్హం. 2016- 17కు ముందు సిలబస్ పుస్తకాలే ఉండటంతో పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సరిపడా బెంచీలు, ఫ్యాన్లు లేవు, ఉన్న 12 ఏసీల్లో ఒకటే పనిచేస్తోంది. ఇటీవల పాఠకులు ఆందోళన చేయడంతో నాలుగు ఏసీలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. బెంచీలు కూడా సరిగా లేకపోవటంతో కొందరు కిందనే కూర్చుంటున్నారు. మరికొందరు వెంట స్టడీ చైర్లు తెచ్చుకుంటున్నారు. పురుషులు, మహిళలకు ఒక్కొక్కటే మరుగుదొడ్డి ఉండటంతో క్యూ కట్టాల్సి వస్తోంది. సిబ్బందికి కేటాయించిన మరుగుదొడ్డిని మహిళా పాఠకుల సంఖ్యరీత్యా వారికి కేటాయించారు. నూతనంగా మరుగుదొడ్లు నిర్మించినా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్టు ప్రకటించినా.. కొద్దిరోజులకే తొలగించారు. మంచినీళ్లు దొరకని పరిస్థితి ఉంది. చుట్టుపక్కలనున్న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల నుంచి నిరుద్యోగులు ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వస్తున్నారు. గతంలో సెలవులు, సిబ్బంది కొరత రీత్యా నెలలో ఎక్కువ రోజులు గ్రంథాలయం మూసి ఉండేది. ఇటీవల నిత్యం తెరుస్తున్నారు. గతంలో ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కొనసాగే గ్రంథాలయాన్ని రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అటువంటి గ్రంథాలయమే ఇన్ని అసౌకర్యాల మధ్య ఉందంటే మిగిలిన లైబ్రరీల గురించి చెప్పాల్సిన పనిలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అసౌకర్యాలే...
ఖమ్మం జిల్లాలో 24 గ్రంథాలయాలుండగా దాదాపు అన్నీ అసౌకర్యాలతోనే కొనసాగుతున్నాయి. గ్రంథాలయాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు కాకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వస్తోంది. మున్సిపాల్టీలు, పంచాయతీలకు వస్తున్న పన్నులు, ఇతరత్రా నిధులు, దాతల సహకారంతోనే ఈ మాత్రం నిర్వహణ అయినా సాధ్యమవుతుందని గ్రంథాలయ సంస్థ పాలకులు చెబుతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18 గ్రంథాలయాలు ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా లైబ్రరీకే రోజుకు వందికి పైగా అభ్యర్థులు వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంథాలయానికి టేకులపల్లి, పాల్వంచ, సుజాతనగర్, పెనుబల్లి, వీఎం. బంజర తదితర దూరప్రాంతాల నుంచీ వస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లైబ్రరీ తెరుస్తుండగా.. ఉదయం 6 గంటల నుంచే తెరవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అభ్యర్థుల కోసం మంచినీటి సౌకర్యం, కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసినా అవీ.. అరకొరే.. ప్రస్తుతం గ్రూప్స్ అభ్యర్థులు ఎక్కువగా వస్తున్నారు. ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తే.. గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సంఖ్య పెరగనున్నది. దానికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
సౌకర్యాల లేమి వెంటాడుతోంది..
- సువార్త, పందెం, మహబూబాబాద్ జిల్లా
ఖమ్మంలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ నేను టెట్‌కు ప్రిపేర్ అవుతున్నా. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నిత్యం వస్తున్నాను. కానీ ఇక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నాం.
పుస్తకాలు తెప్పిస్తున్నాం.. వసతులు మెరుగు పరుస్తున్నాం..
- కొత్తూరు ఉమామహేశ్వరరావు, చైర్మెన్, ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ
జిల్లా గ్రంథాలయాలకు ఇటీవల పాఠకుల సంఖ్య భారీగా పెరిగింది. వారందరికీ సరిపడా పుస్తకాలు తెలుగు అకాడమీ నుంచి త్వరలో రానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆర్డర్ ఇచ్చాం. రీడర్స్ కోరిక మేరకు వారు అడిగిన బుక్స్‌ను తెప్పిస్తున్నాం.
సౌకర్యాలు కల్పిస్తున్నాం..
విజయలక్ష్మి, లైబ్రేరియన్, కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయం
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అడిగిన మెటీరియల్స్ వెంటనే సమకూర్చుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎప్పటికప్పుడు బుక్స్ ఏర్పాటు చేస్తున్నాం. డోనర్స్ అందజేసిన మెటీరియల్స్ సైతం అభ్యర్థులకు సమకూర్చాం. మంచినీరు, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాం.