Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటాల ఫలితమే ఏసీరెడ్డి నగర్
- సొంత గూటికి చేరిన 600 కుటుంబాలు : ఆహ్వానం పలికిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య
నవతెలంగాణ-వరంగల్
ఎర్ర జెండా పోరాటాలతోనే ప్రజా సంక్షేమం ఏర్పడుతుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా ఏసిరెడ్డి నగర్లో దుర్గయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో 600 మంది సీపీఐ(ఎం) ప్రజాసంఘాల్లో చేరగా.. వారికి నాగయ్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమానికి వేల మంది ప్రజలు హాజరవగా.. జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తేవాలని ఆ పార్టీ నాయకులు అనగానే.. ప్రజలు ఈలలతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. అప్పుడు ఏసీరెడ్డి నగర్‌ను నిలపడానికి రామ సురేందర్ లాంటి ఎందరో త్యాగఫలితమేనని తెలిపారు. అప్పటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నో కేసులు ఇబ్బందులు పెట్టినప్పటికీ తెగించి కొట్లాడి ఏసీరెడ్డినగర్ను నిలుపుకున్నామన్నారు. 30 వేల కుటుంబాలకు ఆశ్రయం కల్పించింది ఎర్రజెండా పార్టీనేనని గుర్తుచేశారు. సొంత స్థలం ఉంటే ఇండ్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదని ఆరోపించారు. 8.50 లక్షల మంది కొత్తగా దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటివరకు కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 40 లక్షల మంది నిరుద్యోగులున్నారనీ, వారికి ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల మాట్లాడుతూ.. ఓరుగల్లు, పోరుగల్లు, పోరాటాల గడ్డ అయిన వరంగల్‌లో 30 ఏండ్ల నుంచి చేస్తున్న నిరంతర పోరాటాల ఫలితంగానే ఇండ్లు సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేకు 30 నుంచి వందల ఎకరాలు ఉన్నాయనీ, రాత్రి సమయంలో ప్రభుత్వ భూములనూ పట్టాలు చేసుకుంటున్నారని విమర్శించారు. సామాన్యమైన ప్రజలు పట్టాలు చేయమంటే సైటు పనిచేయటం లేదని కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇల్లు, నాణ్యమైన విద్య, వైద్యం అందాలంటే.. అది ఎర్రజెండాతోనే సాధ్యమని తెలిపారు. వాటి సాధనకోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్.రంగయ్య మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) బలంగా ఉంటేనే ప్రజల హక్కులను సాధించుకోవొచ్చని తెలిపారు. కార్యక్రమంలో రంగశాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్, సీఐటీయూ నాయకులు ముక్కెర రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.