Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో నిర్లక్ష్య ధోరణిని ఎందుకు ప్రదర్శిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలు ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేండ్ల్లవుతున్నా...తీరలేదని పేర్కొన్నారు. ఆ గ్రామానికి ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయని గుర్తు చేశారు. ఈమేరకు ఆదివారం సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆ ఊరిలో పరిస్థితులు చాలా ఆధ్వాన్నంగా ఉన్నాయనీ, కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికీ గ్రామానికి రెవెన్యూ హోదా ఇవ్వకపోవడం అత్యంత విచారకరమని తెలిపారు. నిరుపేద దళితుడు చిలువేరు జానీ కుటుంబంతో కలిసి తాను భోజనం చేశాననీ, ఎంతో దీనమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం జీవనం సాగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఊరికి మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదనీ, అక్కంపేటలో జయశంకర్ పేరిట స్మృతివనం నిర్మించాలని కోరారు. ఓఆర్ఆర్ కోసం కూడా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైందనీ, లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డునపడే పరిస్థితి దాపురిం చిందని వివరించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వెనక్కి తీసుకుంటున్నట్టు కిందిస్థాయి నాయకులు చేస్తున్న ప్రకటనలు వారిలో విశ్వాసం నింపడం లేదని పేర్కొన్నారు. దీనిపై సీఎం ప్రకటన చేయాలని కోరారు.