Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
నవతెలంగాణ-మట్టెవాడ/ఎన్జీఓస్ కాలనీ
వరంగల్ నగరం రక్తమోడింది. నగర పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఆటోను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. వరంగల్ జిల్లా అల్లిపురం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సింగారపు యాకూబ్ పాషా (23), హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన పల్లె పద్మ (35), హనుమకొండలోని వినాయకనగర్‌కు చెందిన వల్లెపు మీనా (28) ఆటోలో వెళుతున్నారు. పద్మ, మీనా కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఘటన గురించి పోలీసులు, అంబులెన్స్ సిబ్బందికి ఎవరూ సమాచారం ఇవ్వకపోవడంతో మృతదేహాలు సుమారు మూడు గంటల పాటు రోడ్డుపైనే ఉన్నాయి. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
వరంగల్ నగరం నుంచి ఖమ్మం వెళ్లే ఫ్లైఓవర్ మీద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢకొీనగా.. వాటిలో ఓ కారు ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన సుజాత(53) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త సారయ్య (55) తీవ్రంగా గాయపడటంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సారయ్య మృతి చెందాడు. మరో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కాసీమ్ తీవ్ర గాయాల పాలు కాగా ఆయన్ను ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు.