Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారంభమైన ఐదు నిమిషాల వరకు అనుమతి
- 2,861 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
- 5,09,275 మంది విద్యార్థుల హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. వాటిని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో రెండేండ్ల తర్వాత విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకూ పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. అయితే 9.35 గంటల తర్వాత అంటే పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాలు దాటితే విద్యార్థులకు అనుమతి ఉండదు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 2,861 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 11,401 పాఠశాలల నునంచి 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలున్నారు. 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రయివేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో 70 శాతం సిలబస్‌తోనే ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే. 2,861 పరీక్షా కేంద్రాల్లో 2,861 మంది చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), 2,861 మంది డిపార్ట్మెంటల్ అధికారులు (డీవో)తోపాటు 33 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు నలుగురు ప్రత్యేక ఫ్లైయింగ్ స్క్వాడ్లు సహా రాష్ట్రవ్యాప్తంగా 144 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా సమయంలో విద్యుత్ కోతల్లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఇబ్బందుల్లేకుండా సకాలంలో చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఎండల తీవ్రత నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో ఏఎన్ఎం, ఆశా ఉద్యోగి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పరీక్షా కేంద్రాల్లో సిద్ధంగా ఉంటారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ అమలుతోపాటు చుట్టుపక్కల జిరాక్స్ కేంద్రాలు పరీక్ష పూర్తయ్యే వరకు మూసేయాల్సి ఉంటుంది. ప్రతి పరీక్షా కేంద్రంలో సీఎస్ గదితోపాటు అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, సిబ్బంది సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావొద్దు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం 040-23230942 అందుబాటులో ఉన్నది.