Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నేతలు పాలడుగు, సీహెచ్ నర్సింహారావు
- కోల్కతాలో పర్సా ఏడో వర్థంతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ అగ్రనేత పర్సాసత్యనారాయణ కార్మిక హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నడిపారనీ, ఆయన ఆశయసాధన కోసం కృషి చేయాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ నర్సింహారావు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా వర్కింగ్ ఉమెన్ కన్వెన్షన్ సందర్భంగా ఆదివారం కోల్కతాలో పర్సా సత్యనారాయణ వర్థంతిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి పాలకులు కార్మికులు, కార్మిక హక్కులు, కార్మిక చట్టాల పై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా సమైక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ తీరును ఎండగట్టాలన్నారు. పర్సా మహౌన్నత నాయకుడనీ, ఉన్నత విలువల కోసం పాటుపడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ. రాష్ట్ర కార్యదర్శులు ఎస్వీ.రమ, ఆర్.త్రివేణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేబీ రాణి రాష్ట్ర కార్యదర్శులు కె ధనలక్ష్మి, సబ్బరావమ్మ, కె.స్వరూపరాణి, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో...
హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పర్సా సత్సనారాయణ ఏడో వర్థంతిని ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ..పర్సా సత్యనారాయణ ప్రపంచ పరిణామాలపై అవగాహన కలిగి ఉన్న విజ్ఞాన గని అని కొనియాడారు. సీఐటీయూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసి కార్మికోద్యమాన్ని నిర్మించారని చెప్పారు. సింగరేణిలో ఉద్యోగిగా ఉండి నిజాం, జమీందారీ వ్యవస్థకు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని వివరించారు. కార్యకర్తలకు చైతన్యం కలిగించడంలో ఆయన కృషి మరువలేనిదని కొనియాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాడటంలో భాగంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ప్రజానాయకుడని ప్రశంసించారు. పర్సాజీవితం కార్మికవర్గానికి ఆదర్శప్రా యమన్నారు. కార్మికుల హక్కులను కాపాడం కోసం ప్రపంచ కార్మికులను ఏకం చేసి సామ్రాజ్య వాదుల, పెట్టుబడిదారుల దోపిడీ నుంచి కార్మిక వర్గాన్ని విముక్తి చేసేందుకు డబ్ల్యూఎఫ్టీయూ పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, కూరపాటి రమేష్, పి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.