Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులోకి రూ.100 కోట్ల అత్యాధునిక వైద్యపరికరాలు
- ఎంఆర్ఐ మిషన్, క్యాత్‌ల్యాబ్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గాంధీ ఆస్పత్రిలో త్వరలోనే సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. 'గాంధీ'లో ఆదివారం రూ. 13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఅర్ఐ మిషన్, రూ. 9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..ఆస్పత్రిలో దాదాపు 100 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతన వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూర్చుతున్నామని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు వరం లాంటిదని చెప్పారు. ప్లేట్ల బురుజు, వరంగల్ ఆస్పత్రుల్లోనూ ఆ సెంటర్లను రూ.5 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దేశంలో తెలంగాణ సర్కారే తొలిసారి ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. గాంధీ ఆస్పత్రికి ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల ప్రజలు కూడా వైద్యం కోసం వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడిన చరిత్ర గాంధీకుందనీ, సుమారు లక్ష మంది పాజిటివ్ కేసులకు చికిత్స అందించిందనీ, కోవిడ్ సోకిన 1698 గర్భిణీలకు డెలివరీలు చేయడంతో పాటు 1163 మందికి బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్యం అందించిందని వివరించారు. మోకాలి చిప్ప మార్పిడి లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నదనీ, గాంధీ ఆస్పత్రిలో నాలుగు నెలల్లో 48, ఉస్మానియాలో ఆరు నెలల్లో 50కిపైగా మోకీలు ఆపరేషన్లు ఉచితంగా చేశామని చెప్పారు. నిజామాబాద్, వేములవాడ, సిద్దిపేట ఆస్పత్రుల్లోనూ మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు ప్రారంభమయ్యా యని తెలిపారు. గుండెసంబంధ రోగులకు గాంధీలోని క్యాత్‌ల్యాబ్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐతో పాటు వెంటిలేటర్లు, అత్యాధునిక ఐసీయూలు, మోడ్యులర్ థియేటర్లు, ఎండోస్కోప్స్, క్యాథ్‌ల్యాబ్ వంటి అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చామ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం రు. 20 కోట్లతో తొలిసారి బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటనెన్స్ పాలసీని తీసుకురాబోతున్నదనీ, తద్వారా అన్ని ఆస్పత్రుల్లోని వైద్య పరికరాలు ఎల్లప్పుడూ క్రియాశీలకంగా ఉండనున్నాయని తెలిపారు. ఆరోగ్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా బడ్జెట్లో రూ.11,440 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్నవాటిపై రోగుల ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో మరో 91 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. టి డయాగస్టిక్లో 57 రకాల పరీక్షలు చేస్తున్నామనీ, ఆ సంఖ్యను 134కి పెంచబోతున్నామని తెలిపారు. రోగుల సహాయకుల కోసం 18 చోట్ల రూ.5 భోజనం అందిస్తున్నామనీ, షెల్టర్ హోమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, టీఎస్ఎమ్ఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఇ రమేష్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, తదితరులు పాల్గొన్నారు.