Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటితో ముగియనున్న పరీక్షలు
- మూల్యాంకనం కేంద్రాలను పరిశీలించిన జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈనెల ఆరో తేదీన ఈ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 19 నాటికి ఇంటర్ ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ముగిశాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,64,626 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,42,767 మంది కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారికోసం 1,443 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 12 నుంచి 14 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది మంచిర్యాల, నిర్మల్‌లో కొత్తగా మూల్యాంకన కేంద్రాలను ప్రారంభించారు. వచ్చేనెల 20వ తేదీలోపు ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదివారం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీలో ఉన్న మహబూబియా జూనియర్ కాలేజీ, వెస్ట్‌మారెడ్ పల్లిలో ఉన్న కస్తూర్బాగాంధీ మహిళా కళాశాలలోని మూల్యాంకనం కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్తోపాటు ఇతర అధికారులున్నారు. అధ్యాపకులు జవాబు పత్రాలను దిద్దుతున్న తీరును గమనించారు. వసతులను పరిశీలించారు. మూల్యాంకనం చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తప్పులు దొర్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.