Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు, ఇతరుల ఫిర్యాదు
- భూసేకరణకు తీవ్ర అభ్యంతరాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణం చేపట్టిన భూసేకరణపై తీవ్ర అభ్యం తరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇప్పటికే ఇచ్చిన రెండు గెజిట్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో అభ్యంతరాల స్వీకరణ తుదిదశకు చేరుకుంది. భువనగిరి, ఆందోల్ -జోగిపేట్ నుంచి 20 ఫిర్యాదులకుపైగా వచ్చాయి. చౌటుప్పల్, ఆందోళ్-జోగిపేట్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల నుంచి ఈ అభ్యంతరాలు వచ్చాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 19వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదల చేసిన రెండు గెజిట్లకు స్థానిక కాంపిటెంట్ అధికారులు 21 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించారు. వాటిలో చౌటుప్పల్ నుంచి తొమ్మిది, ఆందోల్-జోగిపేట్ నుంచి 11 వచ్చినట్టు ఎన్హెచ్ఏఐ అధికారుల సమాచారం. ముఖ్యంగా చౌటుప్పల్లో ఆర్ఆర్ఆర్ జంక్షన్ రోడ్డు, ఇంటర్ఛేంజర్ నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజానీకం తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో సాధ్యంకాకపోయినా(వయబిలిటి) ఇంటర్ఛేంజర్ను ఇక్కడే ఎందుకు ప్రతిపాదించారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. చౌటుప్పల్ ఆర్డీవో పరిధిలోని వలిగొండ మండలం రెడ్లరేపాక నుంచి ఈ అభ్యంతరం వచ్చినట్టు తెలిసింది. ఇక ఆందోల్-జోగిపేట్తోపాటు చౌటుకూర్ నుంచి కూడా ఇదే తరహా అభ్యంతరాలు వచ్చాయని సమాచారం. ఇక్కడ కూడా ఆర్ఆర్ఆర్ జంక్షన్ సంబంధిత అభ్యంతరాలనే స్థానికలు లేవనెత్తినట్టు సమాచారం. మొత్తం 778.89 ఎకరాల భూమికిగాను ఫిర్యాదులు అందినట్టు అధికారులు అంటున్నారు. అభ్యంతరాల గడువు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో వాటిని స్థానిక కాంపిటెంట్ అథారిటీ అధికారులు(ఆర్టీవోలు) నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)కు నివేదించనున్నారు. సంబంధిత అభ్యంతరాలపై సమగ్రంగా విచారణ జరిపి, స్థానికుల సందేహాలను తొలగించే ప్రయత్నాలు ఎన్హెచ్ఏఐ చేయనుంది. అనంతరం, ఆర్ఆర్ఆర్ తుది అలైన్మెంటు ఖరారు చేయడానికి ఇంకో మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి పరిహారం, ఇతర వివాదాలు, కోర్టు కేసుల వంటి సమస్యలు ఏర్పడితే నిర్మాణంలో జాప్యం జరగవచ్చని చెబుతున్నారు. అభ్యంతరాలను పరిశీలించేందుకు ఒకసారి బహిరంగ విచారణ ఉండే అవకాశం ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత వాటిని ఎన్హెచ్ఏఐ అధికారులు సైతం మరోసారి అధ్యయనం చేస్తారు. అనంతరం బహింరంగ విచారణ చేపడతారు. అభ్యంతరాలు లెవనెత్తిన, ఫిర్యాదు చేసిన రైతులు, ప్రజలు, ఇతరులకు అవగాహన కల్పిస్తారని తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆర్ఆర్ఆర్ తనిర్మాణానికి కావాల్సిన భూమిపై హద్దులు ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. ఆ తర్వాతే భూసేకరణకు గ్రిన్సిగల్ వచ్చినట్టవుతుందని అధికారిక సమాచారం.