Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘటనలు
నవతెలంగాణ ములుగు/మర్కుక్/హవేలి ఘనపూర్
వేర్వేరు ఘటనల్లో నీళ్లలో జారిపడి నలుగురు మృతిచెందారు ఈ ఘటనలు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఆదివారం జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ముగ్గురు యువకులు వండ్లముడి అక్షరు వెంకట్(27), రాజన్‌శర్మ(27), రిషబ్‌షా(27) సరదాగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కొండపోచమ్మసాగర్ సందర్శించడానికి ఆదివారం ఉదయం 6 గంటలకు వెళ్లారు. సాగర్‌లో సెల్ఫీ దిగుతుండగా అక్షరు వెంకట్ కాలు జారి నీళ్లలో పడిపోయాడు. పక్కనే ఉన్న రాజన్నశర్మ గమనించి స్నేహితుడిని కాపాడుకునే క్రమంలో అతనూ నీట మునిగిపోయాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో రిషబ్‌షా.. వెంటనే మర్కుక్, ములుగు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న గజ్వేల్ ఏసీపీ రమేష్, గజ్వేల్ రూరల్ ఇంచార్జి సీఐ కమలాకర్, ములుగు, మర్కుక్ ఎస్ఐలు రంగాకృష్ణగౌడ్, శ్రీశైలంయాదవ్.. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లికి చెందిన సుశీల, తన సొదరి నాగమణి, సోదరుడు ఎరుకుల గంగారాంల కుటుంబసభ్యులతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు మెదక్ జిల్లా హవేలిఘన్‌పూర్ మండలం తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో పల్లె పోచమ్మ ఆలయానికి ఆదివారం వెళ్లారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కలిసి సమీపంలో ఉన్న గిద్దకుంటలో స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగిన గంగారాం, సుశీల కొడుకు లక్ష్మణ్ (18).. లోతు తెలియక గుంతలోకి జారుకొని ఒకరి తర్వాత మరొకరు నీటమునిగారు. లక్ష్మణ్ చేయి పైకి కనిపించడంతో గమనించిన సిద్దిరాములు వారిని కాపాడేందుకు చీరను అందించేందుకు ప్రయత్నించినా కాపాడలేకపోయాడు. వారు కుంటలో మునిగి మృతి చెందారు. మృతులు ఎరుకుల గంగారాం(34) మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. సమాచారం అందుకున్న ఎస్ఐ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించి సంచనామా నిర్వహించి మెదక్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ్ తల్లి సుశీల, గంగారాం భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.