Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారంలోకి వచ్చాక ప్రతి రూపాయి చెల్లిస్తాం
- : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-బొంరాస్ పేట్
వచ్చే ఏడాది వరకు వివిధ బ్యాంకుల్లో రూ. 2లక్షల వరకు తీసుకున్న రుణాలను రైతులు ఏ ఒక్కరూ చెల్లించవద్దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చెల్లించే పూర్తి బాధ్యత తమదేనని టీపీసీసీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రైతు రచ్చ బండ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా బొంరాస్ పేట్ మండలం తుంకిమెట్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అనంతరం, సీఎం కేసీఆర్ హయాంలో మొట్టమొదటగా తెలంగాణ సిద్దాంత కర్త, ఉద్యమకర్త అయిన స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సొంత గ్రామం అయిన అక్కంపేట్లో అభివృద్ధి జరిగి ఉండొచ్చని భావించి అక్కడ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తే.. కనీసం అయన విగ్రహం పెట్టలేదని, స్మృతి వనం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఆ గ్రామస్తులకు ఇండ్లు, పింఛన్లు ఇవ్వకపోవడంతో పాటు మిషన్ భగీరథ నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. ఆ గ్రామాన్ని.. కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ జిల్లాలో కాక హన్మకొండలో కలిపి ఉనికి లేకుండా చేసిందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం వేల గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఎందుకు జయశంకర్ సార్ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని యావత్ తెలంగాణ సమాజానికి చాటి చెప్పిన తెలంగాణ ఉద్యమ కర్త పుట్టిన ఊరికే దిక్కు లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించలేదన్న కారణంతో ఆ గ్రామ ప్రజలపై తప్పుడు కేసులు పెట్టారని గ్రామస్తులు రచ్చబండలో వాపోయారని తెలిపారు. మరి టీఆర్ఎస్ నాయకులను ఏం చేద్దామని ప్రశ్నించగా.. త్వరలోనే ఆ నాయకులకు బుద్ది చెబుతామని చెప్పారని అన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా ఇదే విధమైన తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికై గతంలో నారాయణపేట్ ఎత్తిపోతల పథకం మంజూరు చేయించి, నియోజకవర్గంలోని లక్షా ఏడు వేల ఎకరాలకు కృష్ణా జలాలు అందించేందుకు 69జీవో తెస్తే సీఎం బుట్ట దాఖలు చేశాడని తెలిపారు. వికారాబాద్ టూ కృష్ణ రైల్వే లైన్ ఫైల్ సీఎం ముందుకు కదలనీయడం లేదన్నారు. కొండగల్ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధం.. కేటీఆర్ నువ్వు సిద్దమా అని సవాల్ విసిరారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, మిల్లర్లతో కుమ్ముకై రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఆ కుటుంబాలను కనీసం పరామర్శించడం లేదన్నారు. రైతులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్‌లో రైతు డిక్లరేషన్ చేయడం జరిగిందన్నారు. త్వరలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని, మీ అప్పులు కట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు నర్సిములు గౌడ్, నాయకులు, రాంచంద్రారెడ్డి, జయకష్ణ, రాజేష్ రెడ్డి, వెంకట్రాములు గౌడ్, అంజిల్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, మల్లేష్, దేశ్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
నిఖత్ జరీన్‌కు రూ ఐదు లక్షల పారితోషికం : రేవంత్ ట్వీట్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన నిఖత్ జరీన్‌ను టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈమేరకు ఆది వారం ఆయన ట్వీట్ చేశారు. నిఖాత్ జరీన్‌కు రూ ఐదు లక్షల పారితోషికం ప్రకటించారు. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిని చ్చిందని పేర్కొన్నారు. పీవీ సింధు, సైనా, సానియా మీర్జాలకు తెలంగాణ ప్రభుత్వం పారితోషికం ఇచ్చినట్టే నిఖత్ జరీన్‌కు కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.