Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమల్లో లేని రెంట్ కంట్రోల్ యాక్టు
- అగ్రిమెంట్లు ఇవ్వని ఇండ్ల యజమానులు
- సింగిల్ బెడ్ రూమ్ రూ.7 వేల నుంచి రూ.8 వేలు
- 'డబుల్' అయితే రూ.12 వేలకుపైనే
- సవాలక్ష ఆంక్షలు..తినేతిండి, చేసే వృత్తి నచ్చితేనే అద్దెకు ఇండ్లు
- ఓన్లీ వెజిటేరియన్ బోర్డులతో కులవివక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో ఇల్లు కిరాయికి తీసుకోవాలంటే సవాలక్ష ప్రశ్నలు..ఆంక్షలు..కులవివక్షలు ఎదుర్కోవాల్సిందే. ఆ టెస్టులో పాసైనా ఇంటి అద్దెలు చూస్తే గుండెలు అదరాల్సిందే. మాస్, సెమీమాస్ ఏరియాల్లోనే సింగిల్ బెడ్ రూమ్ ఇంటి కిరాయి రూ. 7 వేల నుంచి రూ.8 వేలపైనే. దీనికి తోడు కరెంటు, మంచినీళ్ల బిల్లు..వాటర్‌ను ట్యాంక్‌పైకి ఎక్కించేందుకుగానూ వేరేగా చెల్లించాల్సిందే. వాటన్నింటికీ కలిపి మరో రూ.500 వరకు ఇంటి యజమానులకు సమర్పించాల్సిందే. దానికి సిద్ధపడ్డా ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్యపైనా పరిమితులే. అంతా ఓకే అయినా, తినేతిండి, చేసే వృత్తి విషయంలో యజమానుల క్లియరెన్స్ పొందాల్సిందే. అద్దె ఇండ్ల కోసం తిరుగుతున్న సగటు పౌరులు రాజధాని నగరంలో ఎదుర్కొంటున్న ఇబ్బదులివీ. ఇక్కడే కాదు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. వచ్చే జీతంలో 35 నుంచి 40 శాతం ఇంటి అద్దెలకే పోతున్న పరిస్థితి. మరోవైపు రెంటల్ యాక్టు ప్రకారం అమలు చేయాల్సిన ఒక్కదాన్ని కూడా యజమానులు అమలు చేయని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
కరోనా కాలంలో వేతనాలు తగ్గడం, ఉపాధి అవకాశాలు తగ్గడంలో చాలా మంది ఇంటి అద్దెలు తక్కువగా ఉండటంతో నగర శివార్లకు వెళ్లిపోయారు. ఈ రెండేండ్లలో పెట్రోల్ రేట్లు రూ.50 దాకా పెరగడం, పనిప్రదేశాలకు ఇంటి నుంచి వెళ్లేందుకు దూరంపెరిగి భారంగా మారడంతో మళ్లీ పాత స్థానాలకు వెళ్లేందుకుగానూ చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సందట్లో సడేమియాగా ఇదే అదునుగా భావించి ఇంటి అద్దెలను యజమానులు బరాబర్ పెంచేశారు. మాస్, సెమీ మాస్ ఏరియాల్లోనే సింగిల్ బెడ్ రూమ్ రూ.7 వేల నుంచి 8 వేలు ఉంది. దీనికి తోడుగా కరెంటు బిల్లు రూ.200 నుంచి రూ.300, వాటర్ బిల్లు 100, వాటర్‌ను ట్యాంక్‌లోకి ఎక్కించేందుకుగానూ మోటారు కరెంటు బిల్లు రూ.100, మెట్లు ఊడ్చేటందుకు రూ.100 ఇలా మరో ఐదారొందల రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని మొహమాటం లేకుండానే ఇంటి యజమానులు చెప్పేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ (చిన్నరూములున్నవి) రూ.12 వేలు, పెద్ద రూములున్నవైతే రూ.15 వేలు చెబుతున్నారు. దీనికి మెయింటనెన్స్ అదనం. డబుల్ బెడ్ రూమ్ అద్దె తీసుకోవాలంటే కనీసం రూ.40 వేల నుంచి 50 వేల వేతనం ఉండాల్సిందే.
రెంట్ కంట్రోల్ యాక్టు అమలెక్కడీ
రాష్ట్రంలో రెంట్ కంట్రోల్ యాక్టు ఎక్కడా అమలు కావడం లేదు. అద్దెకి దిగే సమయంలోనే ఇంటి యజమాని, కిరాయిదారునికి మధ్య అద్దె ఒప్పంద పత్రం రాసుకోవాలి. ప్రతి 11 నెలలకు ఒకసారి ఆ ఒప్పంద పత్రాన్ని తిరిగి రాసుకోవాలి. అద్దెకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రెంట్ కంట్రోల్ అథారిటీ విభాగం ఉండాలి. అద్దె ఒప్పందాన్ని రెంట్ అథారిటీకి నివేదించిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేస్తారు. రెండు నెలల్లో అమలు చేయబడిన అద్దె ఒప్పందాన్ని నివేదించాలి. ఒకేసారి అద్దె పెంచడానికి వీలులేదు. ఒకవేళ అద్దె పెంచాల్సి వస్తే కిరాయికి ఉండేవాళ్లకు మూడు నెలల ముందే చెప్పి ఆ తర్వాత అమలు చేయాలి. ఇవన్నీ రెంట్ కంట్రోల్ యాక్టులోని నిబంధనలు. కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇవి అమలు కావడం లేదు. రెంటల్ అగ్రిమెంట్ పత్రం ఇస్తే ఇంటి కిరాయితో పాటు అందులో ఉన్న సదుపాయాలన్నింటినీ పొందుపర్చాల్సి ఉండటంతో యజమానులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇంటి అద్దె ఎక్కువగా ఉంటే ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దానివల్ల అగ్రిమెంట్లు ఇవ్వడం లేదు. ఇండ్ల యజమానుల తీరుతో కిరాయిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్‌కార్డులో పేరు సవరించాలన్నా...పాఠశాలలో సమర్పించే ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా అధికారులు కచ్చితంగా రెంటల్ అగ్రిమెంట్ పత్రాలు అడుగుతున్నారు. దీనిపై కిరాయిదారులు యజమానులను అడిగితే ఉంటే ఉండండి..లేకుంటే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సింగిల్ బెడ్ రూమ్‌లో ఐదుగురు సభ్యులుండరాదని నిరాకరించడం కూడా చట్టవిరుద్ధమే. తల్లిదండ్రులున్నవారు ఎక్కడికి పోవాలనే సోయిని కూడా మరిచి యజమానులు ప్రవర్తిస్తున్నారు. వృత్తిని, కులాన్నిబట్టి ఇండ్లను ఇవ్వడానికి నిరాకరించడమూ నేరమే. ఇంటి అద్దెలపై రాష్ట్ర సర్కారు నియంత్రణలేకపోవడం యజమానుల ఇష్టారాజ్యానికి కారణమవుతున్నది.